ఆ ఉన్మాది వేసిన ప‌క్కా ప్లానింగ్ తెలిస్తే షాకే

Update: 2017-10-04 09:43 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా చ‌రిత్ర‌లోనే..అత్యంత దారుణ‌మైన కాల్పుల‌కు ఒడిగ‌ట్టిన రిటైర్డ్ అకౌంటెంట్ స్టీఫెన్ పడాక్ విష‌యంలో సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అస‌లు ఎలాంటి నేర‌ ప్ర‌వృత్తి లేని స్టీఫెన్‌ ఎందుకు షూటర్‌ గా మారాడో ఇంకా తెలియదు కానీ ఆయ‌న కాల్పుల‌ ఉదంతంలో క‌ల‌కలం రేకెత్తించే అంశాల‌ను పోలీసులు వివ‌రించారు. లాస్ వెగాస్‌ లో జరుగుతున్న మ్యూజిక్ కన్‌ సర్ట్‌ పై అతను కురిపించిన తూటాల వర్షానికి 58 మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పోలీసులు లోతుగా సాగిస్తున్న ద‌ర్యాప్తులో సాయుధుడైన స్టీఫెన్‌ సుమారు 11 నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

పోలీసుల అంచనాల ప్రకారం ఆ షూటర్ సుమారు 9 నుంచి 11 నిమిషాల పాటు ఫైరింగ్ జరిపినట్లు నిర్ధారణకు వచ్చారు. మండాలే బే హోటల్‌ లోని తన రూమ్ నుంచి డజన్ల సంఖ్యలో రైఫిళ్లను కూడా సేకరించారు.  స్టీఫెన్ రూమ్‌ లో సుమారు 12 లీగల్ రైఫిల్ డివైస్‌ లు ఉన్నాయి. అవి ఆటోమెటిక్ రైఫిళ్ల తరహాలో రాపిడ్‌గా బుల్లెట్‌ ను ఫైర్ చేయగలవు. ఫైరింగ్‌ కు సమీపంలో ఉన్న పోలీసుల డాష్‌ కామ్ వీడియోను కూడా అధికారులు రిలీజ్ చేశారు. మ‌రోవైపు  షూటర్ స్టీఫెన్ తన రూమ్‌లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ సూట్‌ లో ఉన్న కెమెరాలు ఫైరింగ్ సమయంలో లైవ్ ఇచ్చాయా లేదా అన్న అంశాన్ని పోలీసులు తేల్చలేకపోతున్నారు. తన రూమ్ వైపు వచ్చే వారి పట్ల నిఘా పెట్టేందుకు కెమెరాలను వాడి ఉంటాడని ఎఫ్‌ బీఐ పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా సుమారు 20 వేల మందికిపైగా మ్యూజిక్ షోకు హాజరయ్యారు. అయితే కాల్పుల ఘటన వల్ల జనం అంతా ఒక్కసారిగా బయటకు పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దాని వల్లే భారీ సంఖ్యలో జనం గాయపడ్డారు. కేసును విచారిస్తున్న పోలీసులు మరో ఆసక్తికర విసయాన్ని కూడా కనుగొన్నారు. ఉన్మాది స్టీఫెన్ పడాక్ ఫైరింగ్‌ కు ముందు తన అకౌంట్ నుంచి పిలిప్పీన్స్‌ కు లక్ష డాలర్లు ట్రాన్స్‌ ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ డబ్బును ఎవరు స్వీకరించాన్న అంశాన్ని మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఆ వివ‌రాల కోసం కోసం ఎఫ్‌ బీఐ అధికారులు పిలిప్పీన్స్ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. పడాక్ గర్ల్‌ ఫ్రెండ్ మారిలో డాన్లే ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ చేరుకుంది. ఆమెను ఎఫ్‌ బీఐ విచారిస్తోంది. స్టీఫెన్ ఎందుకు షూటర్‌ గా మారడాన్న అంశాన్ని ఆమె మాత్రమే వెల్లడించగలదు అని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News