డ్రెస్ కోడ్ పై భగ్గుమన్న కాలేజీ అమ్మాయిలు

Update: 2019-09-16 11:15 GMT
ఇది 21వ శతాబ్ధం.. స్వేచ్ఛా స్వాతంత్యాలు నిండుగా ఉన్న కాలం మనది.. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదు.. అంతరిక్ష అధిరోహకులు అని చాటిచెబుతున్న కాలమిదీ.. అలాంటి కాలంలో ఏకంగా కాలేజీ అమ్మాయిలు వేసుకునే  దుస్తులపై ఆంక్షలు విధించింది ఓ కాలేజీ యాజమాన్యం. పొట్టి దుస్తులు వేసుకుంటే కాలేజీలోకి రాకుండా అడ్డుకుంది.. దీంతో హైదరాబాద్ లోని ఓ కాలేజీలో కాలేజీ అమ్మాయిలంతా రోడ్డెక్కారు.

హైదరాబాద్ బేగం పేటలోని సెయింట్ ప్రాన్సిస్ కళాశాలలో అమ్మాయిల దుస్తులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించింది. మోకాళ్లపైకి దుస్తులు వేసుకొని అమ్మాయిలు రావడానికి వీల్లేదని.. అలా వస్తే కాలేజీలోకి అనుమతించమని పేర్కొంది. అంతేకాదు.. కాలేజీ గేటు వద్ద ఓ ఉపాధ్యాయిని నిలవడి వాళ్ల దుస్తులు పరిశీలించి సరిగా ఉంటేనే లోపలికి అనుమతించేలా నిబంధనలు పెట్టారు.

అయితే ఈ నిబంధనపై కాలేజీ అమ్మాయిలు భగ్గుమన్నారు. కొందరు కుర్తాలు, పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చినా మోకాళ్లపైకి టాప్ ఉందని వెనక్కి పంపించడం వివాదాస్పదమైంది. కుర్తాలు కూడా మోకాళ్ల కిందకు ఉండడం ఏంటని కాలేజీ అమ్మాయిలు అంతా రోడ్డెక్కారు.

తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున కాలేజీ ఎదుట చేరి నినాదాలు చేశారు. ఆధునిక యుగంలోనూ ఈ కట్టుబాట్లు ఏమిటని.. షార్ట్స్ వేసుకొని కాలేజీకి రావడం వల్ల నష్టమేంటి అని నిరసన తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థినులకు నచ్చచెప్పారు. ప్రస్తుతం పొట్టి దుస్తులపై విద్యార్థులు చేసిన నిరసన వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా దీనిపై దుమారం చెలరేగింది.
Tags:    

Similar News