2023-24 శోభకృత్ నామ ఉగాది సంవత్సరం రాశిఫలాలు..

Update: 2023-03-22 10:10 GMT
ఉగాది.. ఇది మన తెలుగు సంవత్సరాది..

కొత్త చిగుళ్లు.. సరికొత్త ఆరంభాలు.. కొత్త పంచాంగ శ్రవణాలతో తెలుగుదనం ఉట్టిపడే పండుగ ఇదీ.. ఉగాదితోనే మన నవశకం ఆరంభమైంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. షడ్రుచుల సమ్మేళనంలా మన బంధాలు కలకలం నిలవాలని ఈరోజు అందరూ ఆ పానీయాన్ని తాగి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ఇక ఉగాది రోజున అందరూ చేసే పని.. మన రాశి ఎలా ఉంది? మన ఆదాయం ఎంత వ్యయం ఎంత? ఈ సంవత్సరం శనిప్రభావం ఉంటుందా? అని ఆరాతీస్తారు.  రాశుల  శుభా అశుభ ఫలితాలపై తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఈ క్రమంలోనే 2023-24 శోభకృత్ నామ ఉగాది సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేష రాశి

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1

 మేష రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. దీంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్ 22 నుంచి జన్మరాశిలో గురువు సంచరించడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అక్టోబర్ 31 వరకు కేతువు సప్తమంలో ఉండటంతో శ్రమ ఉంటుంది.

2. వృషభ రాశి

ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1

వృషభ రాశి వారికి పెట్టుబడులు అనుకూలిస్తాయి. 75 శాతం అదృష్టం ఉండటంతో చేపట్టే పనుల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విశేషమైన కాలం. ఉద్యోగులకు లాభాలున్నాయి. వ్యాపారాలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. విదేశాల్లో పనిచేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఏప్రిల్ 22 తరువాత గురువు ద్వాదశకంల సంచరించడం వల్ల నష్టాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండ గురుశ్లోకం చదువుకోవాలి. నవంబర్ నుంచి శుభ యోగం కలుగుతుంది. కేతువు అక్టోబర్ వరకు అనుకూల ఫలితాలు ఇస్తుంటాడు.

3 మిథున రాశి

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4

మిథునరాశి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. 50 శాతం అదృష్టం ఉంటుంది. విద్యార్థులకు అనువైన కాలం. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 23 నుంచి అదృష్ట యోగం ఉంటుంది. అక్టోబర్ 31 వరకు ఏకాదశ స్థానంల సంపూర్ణ శుభయోగం కలుగుతుంది. నవంబర్ 1 నుంచి రాహువు దశమంలో కార్యసిద్ధి కలిగిస్తాడు. కేతు సంచారం వల్ల మానసిక సమస్యలు రావచ్చు. కేతు శ్లోకం చదువుకుంటే మంచిది.

4. కర్కాటక రాశి

ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4

కర్కాటక రాశి  వారికి అదృష్ట యోగం ఉంది. 75 శాతం అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి. శని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏప్రిల్ 22 వరకు బృహస్పతి శుభ ఫలితాలు అందిస్తాడు. ఏప్రిల్ 23 నుంచి గురువు దశమంలో ఉండటంతో శ్రమ పెరుగుతుంది. శని అష్టమంలో ఉండటంతో మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. అక్టోబర్ 31 వరకు శని దశమంలో కార్యసిద్ధి ఇస్తాడు. నవంబర్ నుంచి దివ్యమైన ఫలితాలు వస్తాయి.

5.సింహరాశి

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7

ఈ రాశి వారికి ధనయోగం ఉంది. అదృష్ట యోగం 50 శాతం ఉంది. ఏప్రిల్ 22 రువాత గురుబలం వల్ల విద్యార్థులకు మంచికాలం. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. గురు సంచారంతో ఏప్రిల్ 22 వరకు శ్రమ ఎక్కువవుతుంది. ఏప్రిల్ 23 నుంచి అదృష్టం బాగుంటుంది. శని సప్తమ స్థానంలో ఉండటంతో భాగస్వామితో గొడవలు రావచ్చు. రాహువు అష్టమ, నవమిల్లో ఉండటంతో ఏడాది కలిసి రావడం లేదు. కేతువు అక్టోబర్ 31 వరకు మూడో రాశిలో సంచరించడంతో శుభ ఫలితం ఉంటుంది.

6. కన్య రాశి

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7

విద్యార్థులకు అనువైన కాలం. ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. తరువాత గురుబలం బాగా ఉండనందున కష్టపడి పనిచేయాలి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. గురువు సప్తమంలో ఉన్నప్పుడు శుభయోగాలు ఉంటాయి. ఏప్రిల్ 23 నుంచి ఆటంకాలు కలగొచ్చు. శని ఏడాది షష్ట స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది. అక్టోబర్ 31 తరువాత సప్తమ స్థానంలో రాహువు ఆటంకాలు కలిగిస్తాడు. అక్టోబర్ 31 వరకు తరువాత జన్మ కేతువు ప్రభావంతో నష్టాలు కలగవచ్చు. అందుకే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిదే.

7. తుల రాశి
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7

తులరాశి వారికి అదృష్టం 50 శాతం ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు సొంతం చేసుకుంటారు. విదేశీయానం వీలవుతుంది. ఏప్రిల్ 23 నుంచి గురువు వల్ల అదృష్టం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబర్ 31 వరకు సప్తమంలో ఇబ్బంది కలుగుతుంది. నవంబర్ నుంచి శుభయోగం ఏర్పడుతుంది. కేతువు జన్మరాశిలో ఉండటం వల్ల అక్టోబర్ 31 వరకు ఉండి ఆ తరువాత ద్వాదశంలో ఉండటంతో ఉత్సాహం తగ్గే అవకాశముంది.

8. వృశ్చిక రాశి

 ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3

వృశ్చిక రాశి  వారికి అదృష్టం 75 శాతం ఉంది. అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదురుతుంది. ఏప్రిల్ 22 వరకు గురువు పంచమంలో ఉండటంతో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. ఏప్రిల్ 23 తరువాత ఇబ్బందులు తట్టుకోవడానికి గురు శ్లోకం చదువుకోవాలి. తరువాత పంచమంలో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు.

9.ధనుస్సు రాశి

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3

ధనుస్సు రాశి వారికి అదృష్టం 75 శాతం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యుల్లో సఖ్యత ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి పంచమంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి రోజు రాహు శ్లోకం చదువుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి. అక్టోబర్ 31 వరకు ఏకదశకంలో నవంబర్ నుంచి దశమంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కేతువు వల్ల మంచి శుభాలు కలుగుతాయి.

10. మకర రాశి

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6

మకర రాశి ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏలిన నాటి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడటం సహజమే. చతుర్థంలో అర్ధాష్టమ రాహువు అక్టోబర్ 31 వరకు విఘ్నాలు రావడం కామన్. నవంబర్ నుంచి తెలియని అడ్డంకులు ఏర్పడతాయి. నవంబర్ నుంచి శుభ ఫలితాలు వస్తాయి. దశమంలో అక్టోబర్ 31 వరకు విజయాలు పలకరిస్తాయి. తరువాత కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

11. కుంభ రాశి

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6

కుంభరాశి వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఆస్తులు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి కాలం. ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు అందుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. గురువు ద్వితీయంల బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు. రాహువు తృతీయ స్థానంలో అక్టోబర్ 31 వరకు అన్నింట్లో మంచిగా ఉంటాడు. నవంబర్ నుంచి ద్వితీయంలో ఉండటంతో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు కలగొచ్చు.

12. మీన రాశి

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2

మీన రాశి వారికి అదృష్టం 25 శాతం మాత్రమే ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. గురుబలంతో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏప్రిల్ నుంచి కలిసొస్తుంది. వ్యాపారంలో దూకుడు పనికి రాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీయానం చేసే అవకాశముంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమష్టి నిర్ణయాలతోనే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి ధన స్థానంలో గురువు ఉండటంతో మంచి ఫలితాలు వస్తాయి. ఏలిన నాటి శని కారణంగా అక్టోబర్ 31 వరకు ద్వితీయంలో, తరువాత జన్మరాశిలో రాహువు శ్రమ కలిగిస్తాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News