గ్రేట్ సీక్రెట్‌: మ‌య‌న్మార్‌కు భార‌త్ జ‌లాంత‌ర్గామి!

Update: 2020-10-26 04:15 GMT
శ‌త్రుదేశాల పీచ‌మ‌ణుస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న భార‌త్‌.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు ఎప్పుడో ప్రారంభించిందా?  మిత్ర దేశాల‌ను త‌న వెంట న‌డిచేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోందా? అంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌రిహ‌ద్దు దేశ‌మైన మ‌య‌న్మార్‌(బ‌ర్మా) కు   భార‌త్ అత్యంత కీల‌క‌మైన జ‌లాంత‌ర్గామి సింధువీర్‌ ను ఇచ్చిన‌ట్టు తాజాగా వెలుగు చూసింది. వాస్త‌వానికి ఈ జ‌లాంత‌ర్గామిని మ‌య‌న్మార్‌ కు ఈ నెల 15నే పంపించినా.. విష‌యాన్ని మాత్రం అటు మ‌య‌న్మార్ కానీ, ఇటు భార‌త్ కానీ వెల్ల‌డించ‌క‌ పోవ‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు, ఏ ఉద్దేశం తో దీనిని మ‌య‌న్మార్‌ కు ఇచ్చార‌నేది చాలా ఆస‌క్తిగా మారింది.

నిజానికి యుద్ధ సామ‌గ్రిని కొనుగోలు చేయ‌డం, ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డం వంటివి జ‌రిగేవే. మ‌రి ఈ క్ర‌మంలోనే జ‌లాంత‌ర్గామి సింధువీర్‌ ను మ‌య‌న్మార్‌కు అప్ప‌గించారా? లేక.. ఏం జ‌రిగింది? అనేది ప్ర‌శ్న‌.   వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితి లో భార‌త్‌.. ఇత‌ర దేశాల నుంచి ఆయుధాల‌ను దిగుమతి చేసుకుంటోంది. ఒక‌వైపు చైనా క‌వ్వింపులు, మ‌రో వైపు పాక్ నుంచి పొంచి ఉన్న ముప్పుల నేప‌థ్యంలో ఇటీవ‌లే అమెరికా నుంచి కూడా కొన్ని యుద్ధ విమానాలను, ఆయుధాల‌ను భార‌త్ సేక‌రించింది. అలాంటిది ఇప్పుడు మ‌య‌న్మార్ వంటి చిన్న దేశానికి సింధువీర్ వంటి కీల‌క జ‌లాంత‌ర్గామిని అప్ప‌గించ‌డం వెనుక ఏం జ‌రిగింద‌నేది అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది.

అయితే, ప్రాంతీయ భ‌ద్ర‌త‌ను పెంపొందించే చ‌ర్య‌ల్లో భాగంగానే సింధువీర్‌ను మ‌య‌న్మార్‌కు ఇచ్చి ఉంటార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక్క‌డ కూడా అనేక ప్ర‌శ్న‌లు ఉన్నాయి. దీనిని లీజుకు ఇచ్చారా?  లేక విక్ర‌యించారా? అనేది కూడా ఇత‌మిత్థంగా తెలియ‌డం లేదు. ఇక‌,  ఈ చ‌ర్య ద్వారా.. మయన్మార్‌కు భార‌త్ స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించుకుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆది నుంచి ఈ రెండు దేశాలు సుహృద్భావ వాతావ‌ర‌ణంలోనే క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని,  2013లో మయన్మార్‌ నావికాదళతో క‌లిసి భార‌త్ నావికాద‌ళం ప‌లు విన్యాసాలు కూడా చేసింద‌ని పేర్కొంటున్నారు.

ఇక‌, సింధువీర్ విష‌యానికి వ‌స్తే.. 1988 జూన్ 11న అప్పటి సోవియట్ యూనియన్ భారత్‌కు ఇచ్చింది. దీనిని భారత నావికా దళంలో చేర్చారు. ఈ జలాంతర్గామి అణుశక్తికి బదులు డీజిల్, విద్యుత్‌తో నడుస్తుంది. ఇది నీటి అడుగున 300 మీటర్ల లోతు వరకూ వెళ్లగలదు. బయటి నుంచి ఎలాంటి సాయం లేకపోయినా 45 రోజులు నీటి అడుగునే పని చేయగలదు. అలాంటి కీల‌క‌మైన ఈ జ‌లాంత‌ర్గామిని మ‌య‌న్మార్‌కు ఇవ్వ‌డం వెనుక ఏం జ‌రిగింద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. అయితే, అండ‌మాన్  సముద్రంలో భద్రతా మిషన్ల కోసం మ‌య‌న్మార్‌ జలాంతర్గాములను పంపిస్తోంది.

ఈ క్ర‌మంలో భార‌త్ త‌న కీల‌క జ‌లాంత‌ర్గామిని పంపి ‌సాయం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, అండ‌మాన్ స‌ముద్రం లో థాయ్‌లాండ్.. కూడా జ‌లాంత‌ర్గాముల‌ను పంప‌నుంది. మ‌య‌న్మార్‌, థాయ్‌ల‌కు అండ‌మాన్ స‌ముద్ర జ‌లాల‌ పై వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో థాయ్ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. చైనా నుంచి మూడు జలాంతర్గాములు కొనుగోలు చేసే ఆలోచ‌న‌ లో ఉంది.  అంటే.. థాయ్‌లాండ్‌ కు చైనా స‌హ‌క‌రిస్తే.. మ‌య‌న్మార్‌కు భార‌త్ స‌హ‌క‌రిస్తోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్‌-చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో మ‌య‌న్మార్‌కు స‌హ‌క‌రించ‌డం ద్వారా పొరుగు దేశాల సాయం తీసుకునేందుకు భార‌త్ వేసిన అడుగులో ఇది తొలి అడుగు అయి ఉంటుంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే, జ‌లాంత‌ర్గామి విష‌యంలో ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డం మాత్రం ప‌లు సందేహాల‌కు అవ‌కాశం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News