గవర్నర్ కు డెడ్ లైన్ పెట్టిన బీజేపీ ఎంపీ

Update: 2017-02-13 04:44 GMT
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తీరు ఎలాంటిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆసక్తికర ట్వీట్లతో తరచూ వార్తల్లో ఉండే ఆయన.. ఎప్పుడు ఏ విషయంలో ఎవరి పక్షాన నిలుస్తారో ఊహించటం కష్టమైన విషయమే. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం వెనుక ఢిల్లీ ఉందంటూ బలమైన వాదన వినిపిస్తున్న వేళ.. సొంత పార్టీ లైన్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి. పార్టీ స్టాండ్ తో సంబంధం లేకుండా విషయాల వారీగా తన అభిప్రాయాల్ని వెల్లడించే ఆయన.. అన్నాడీఎంకే ఎపిసోడ్లో ఆయన మద్దుతు శశికళకు ఇవ్వటం తెలిసిందే.

ఇప్పటికే పలుమార్లు చిన్నమ్మకు సపోర్ట్ చేసేలా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల బలం ఉన్న చిన్నమ్మకే అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు. తన అభిప్రాయాన్ని తెలియజేయటం కోసం గవర్నర్ ను కలిసిన వైనం తెలిసిందే. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని తనదైన శైలిలో కొలిక్కితెచ్చేందుకు ఇంతకాలం ప్రయత్నించిన ఆయన.. తాజాగా గవర్నర్ కే అల్టిమేటం ఇవ్వటం గమనార్హం.

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా గవర్నర్ విద్యాసాగర్ రావు కాలయాపన చేయటం సరైనది కాదన్న వాదనను సుబ్రమణ్య స్వామి వినిపిస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెబుతున్న ఆయన.. ప్రస్తుత వైఖరి బేరసారాలకు అవకాశం ఇచ్చేలా ఉందని తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళకు అవకాశం ఇచ్చేలా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని.. 24 గంటల వ్యవధిలో ఆయన కానీ ఏ నిర్ణయం తీసుకోని పక్షంలో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై ప్రజాప్రయోజన వాజ్యం వేస్తానని ఆయన హెచ్చరించటం ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటూ ట్విట్టర్ లో ఓపెన్ గా చెప్పేస్తున్న స్వామి మాటలు ఇప్పుడు కొత్త కలకలాన్ని సృష్టిస్తున్నాయి.

మరోవైపు.. సుబ్రమణ్య స్వామి వైఖరితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్. గవర్నర్ కే డెడ్ లైన్ పెట్టేసిన సుబ్రమణ్య స్వామి వైఖరిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మరి.. స్వామి ఇచ్చిన అల్టిమేటంపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉండనుంది? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో తానుదాఖలు చేసిన కేసు నుంచి దివంగత నేత జయలలిత పేరు తొలగింపుపై స్వామి సానుకూలంగా స్పందిస్తూ.. ఆ దిశగా తాను దరఖాస్తు చేస్తానని చెబుతున్నారు. అమ్మ పేరుతో పాటు.. చిన్నమ్మ మీద చేసిన ఆరోపణల్ని సైతం స్వామి ఉపసంహరించుకుంటారా ఏంటి..?
Tags:    

Similar News