ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ వియ్యంకుడి ఆత్మ‌హ‌త్య‌.. రీజ‌నేంటి?

Update: 2023-02-27 19:06 GMT
ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్‌కు స్వ‌యానా వియ్యంకుడు, డాక్ట‌ర్ అయిన మ‌జారుద్దీన్‌.. తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలోనే గన్‌తో కాల్చు కోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మజారుద్దీన్ అలీ ఖాన్(60) మృతి చెందాడు.

మృతుడు మజారుద్దీన్ అలీ ఖాన్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వియ్యంకుడు. అసదుద్దీన్ ఓవైసీ రెండో కూతురు అఫియా వివాహం సెప్టెంబర్ 22, 2020లో అబిల్ అలీ ఖాన్‌తో నిర్వహించారు. ఒవైసీ ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో అర్థోపెడిక్ విభాగాధిపతిగా మజారుద్దీన్ పనిచేస్తున్నారు. ఈ వివాహంతో ఒవైసీ, మజారుద్దీన్ అలీఖాన్ కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా ఉన్న స్నేహం.. బంధంగా మారింది.

మజారుద్దీన్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలు తెలుసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ తగాదాల కారణంగా మజారుద్దీన్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మజారుద్దీన్పై గతంలో గృహహింస కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News