సుమలతతో అమిత్ షా..ఏం జరుగుతోంది?

Update: 2019-11-18 08:33 GMT
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేశారు. దానివల్లే మేజిక్ మెజార్టీ మార్క్ తగ్గి బీజేపీ కర్ణాటకలో కొలువుదీరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ 17 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. డిసెంబర్ 5న కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ప్రస్తుతం కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం మనుగడ ఈ 17మంది ఎమ్మెల్యేల గెలుపోటములపై ఆధారపడి ఉంది. దీంతో ఉప ఎన్నికలు బీజేపీకి చావోరేవోగా మారాయి. దీనికోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే మాండ్య లోక్ సభ ఎంపీ - ఇండెపెండెంట్ అయిన ప్రముఖ నటి సుమలత మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా - కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఎంపీ సుమలతతో చర్చలు జరిపినట్టు తెలిసింది.

మాండ్య లోక్ సభ పరిధిలో కేఆర్ పేట్ - హుణసూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఎంపీ సుమలత మద్దతు కీలకంగా మారింది. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సుమలతను అమిత్ షా - యడ్యూరప్ప కోరినట్లు సమాచారం. మాండ్యాను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు ఇస్తామని అమిత్ షా - సీఎం యడ్డీ హామీ ఇచ్చారని తెలిసింది. అంతేకాదు.. గత ఎన్నికల్లో సుమలతకు మద్దతు తెలిపి ఆమెను గెలిపించిన బీజేపీ నేత సచ్చిదానందకు నామినేటెడ్ పదవి ఇవ్వడానికి సీఎం యడ్యూరప్ప అంగీకరించినట్లు తెలిసింది.

ఏకంగా అమిత్ షానే కోరడంతో సుమలత బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి ప్రచారం చేయడానికి రెడీ అయ్యినట్లు సమాచారం. రెండు నియోజకవర్గాల ప్రచార బాధ్యతను సుమలత తీసుకోబోతోందని తెలిసింది.
   

Tags:    

Similar News