జగన్ పాలనపై సీనియర్ నటుడు సుమన్ కామెంట్స్..ఆ ఉద్దేశ్యంతోనే జగన్!

Update: 2020-02-16 16:50 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనను - ఆయన వెళుతున్న విధానాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజల కోసం పరితపించిన వైఎస్సార్ వారసత్వం ఏపీ పాలనలో స్పష్టంగా కనిపిస్తోందని, అంతేకాదు అచ్చం తండ్రి లాగానే జగన్ పరిపాలన సాగుతోందని సుమన్ పేర్కొన్నారు.

వైఎస్ జగన్ ఒక నాయకుడు మాత్రమే కాదు.. భావితరాలకు ఆదర్శవంతమైన, మేలైన బాట చూపించే రాజనీతికోవిదుడని పేర్కొంటూ ఆయన్ను ఆకాశానికెత్తారు సుమన్. జగన్  పాలనలో పరిణతి కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు - సామాజిక న్యాయం అన్నింటా జగన్ మార్క్ కనిపిస్తోందని చెప్పిన సుమన్.. సిసలైన వైఎస్సార్ వారసుడు జగన్ అని అన్నారు.

అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరు - అందులో పాటించిన నియమాలు పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం కోసం ఎంతలా పరితపిస్తున్నారో అర్థమవుతోందని సుమన్ చెప్పారు. అలాగే ఎంతో ముందుచూపుతో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని - అన్ని ప్రాంతాలు డెవెలప్ కావాలనే ఆలోచనతో - ఏపీ అంతా ఒక్కటిగా నిలవాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఈ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని అన్నారు.

ఆయన పాలన ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని - ఆయనకు కనీసంగా రెండున్నరేళ్ల  సమయం ఇచ్చి విమర్శిస్తే అందులో అర్థం ఉంటుంది తప్ప.. ఇలా ఇప్పుడే విమర్శలకు పోవడం సరికాదంటూ సుమన్ వ్యాఖ్యానించారు.

   

Tags:    

Similar News