విజయసాయి వర్సెస్ కేవీఆర్? ఈడీ ముందుకు కాకినాడ పోర్టు ఓనర్!

కాకినాడ పోర్టు వాటాల బదిలీపై విచారణ సంస్థలు పట్టుబిగిస్తున్నాయి. సుమారు రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కేవలం రూ.500 కోట్లకు తీసుకోవడంపై ఏపీ సీఐడీ, ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-08 13:17 GMT

కాకినాడ సీపోర్టు, సెజ్ వాటాల బదిలీపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ విషయంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా నిందితులు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని విచారించిన ఈడీ తాజాగా పోర్టు యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీఆర్) వాంగ్మూలాన్ని నమోదు చేస్తోంది. కేవీఆర్ ఎవరో తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఈడీ ఆయనను పిలిపించినట్లు చెబుతున్నారు.

కాకినాడ పోర్టు వాటాల బదిలీపై విచారణ సంస్థలు పట్టుబిగిస్తున్నాయి. సుమారు రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కేవలం రూ.500 కోట్లకు తీసుకోవడంపై ఏపీ సీఐడీ, ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఈ నెల 6న వైసీపీ రాజ్యసభాపక్ష నేత వి.విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. వాటాల బదిలీలో ఆయన పాత్రపై ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విజయసాయిరెడ్డి, అవసరమైతే పోర్టు యజమాని కేవీఆర్ తో కలిపి తనను విచారించొచ్చని ఈడీ అధికారులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

దీంతో ఈ రోజు కేవీఆర్ ను పిలిపించిన ఈడీ అధికారులు ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి ఫోన్ చేస్తేనే తాను మాజీ సీఎం జగన్ సోదరుడు విక్రాంత్ రెడ్డిని కలిసినట్లు కేవీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా సీపోర్టు, కాకినాడ సెజ్ వాటాలు ఏ విధంగా బదిలీ అయ్యాయనే విషయంపైనా లిఖిత పూర్వక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

తనను భయపెట్టి వేల కోట్లు విలువ చేసిన షేర్లను తీసుకున్నారని, విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిపై కేవీఆర్ గతంలోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్న ఈడీ నిందితులను విచారిస్తోంది. ఇదే సమయంలో ఫిర్యాదుదారు నుంచి లిఖితపూర్వక సమాచారం సేకరించడం ఆసక్తి రేపుతోంది. కేవీఆర్ స్టేట్ మెంట్ తో విజయసాయిరెడ్డిని మరోమారు విచారించే అవకాశం ఉందంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి కోరినట్లు కేవీఆర్ తో కలిపి ఆయనను విచారిస్తారా? లేదా? అన్నది చూడాల్సివుంది. దీనిపై ఈడీ అధికారులే తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది.

Tags:    

Similar News