మొదలుకు ముందే ముగింపు.. బీసీసీఐ టెన్ కమాండ్ మెంట్స్ లో ఒకటి ఔట్?
ఇటీవలి కాలంలో దారుణ పరాజయాల రీత్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లు, సిబ్బందికి టెన్ కమాండ్ మెంట్స్ పేరిట నియమాలను అమల్లోకి తెచ్చింది
ఇటీవలి కాలంలో దారుణ పరాజయాల రీత్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లు, సిబ్బందికి టెన్ కమాండ్ మెంట్స్ పేరిట నియమాలను అమల్లోకి తెచ్చింది. వాటిని వచ్చే చాంపియన్స్ ట్రోఫీ నుంచే అమలు చేస్తామని కూడా ప్రకటించేసింది. అసలు బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధనలే డొల్ల అనిపించేలా రంజీ ట్రోఫీ సీజన్ లో ఒకే మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా ఆటగాళ్లు నిరూపించారు.
మరోవైపు క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులను విదేశీ టూర్లకు వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో బీసీసీఐ కొన్ని ఆంక్షలు విధించింది. బుధవారం నుంచి మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీకీ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఆటగాళ్ల ఫిట్ నెస్ నిర్వహణ.. గాయపడినవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాల్లో బీసీసీఐ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికితోడు జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు చర్చనీయాంశం అయ్యాయి. ఇలాంటి సమయంలోనే టెన్ కమాండ్ మెంట్స్ లో ఒకదానిని బీసీసీఐ పక్కనపెడుతుండడం గమనార్హం. అదే ‘నో ఫ్యామిలీ రూల్’.
చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య దేశం పాకిస్థాన్ కాగా.. భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ కి ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చని బోర్డు చెప్పిందట. అయితే, ట్రోఫీలో కేవలం ఒక్క మ్యాచ్ కు మాత్రమే ఈ వెసులుబాటు ఇచ్చినట్లు తెలిసింది. ఫ్యామిలీని వెంట తెచ్చుకునే విషయమై ఆటగాళ్లందరూ చర్చించుకుని అభ్యర్థన చేయాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. అనంతరం బోర్డు ఏర్పాట్లు చేస్తుందట.
‘‘విదేశీ పర్యటన నెల రోజులు ఉంటేనే ఒక వారం కుటుంబ సభ్యులతో ఉండేందుకు వీలు..’’ ఇదీ బీసీసీఐ టెన్ కమాండ్ మెంట్స్ లో ఒకటి. చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9తో ముగుస్తుంది. అంటే 20 రోజులే. అందుకని ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతించ లేదు. ఓ సీనియర్ క్రికెటర్ కోరినా.. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
కానీ, ప్రస్తుతం టోర్నీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఒక్క మ్యాచ్‌కు మాత్రం ఆటగాళ్లు కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునేందుకు అనుమతినిచ్చింది.
కొసమెరుపు: బీసీసీఐ అనుమతి మేరకు క్రికెటర్లు కుటంబాలతో గడిపే ‘ఆ ఒక్క మ్యాచ్’ ఏది? అనే ఆసక్తి నెలకొంది. భారత్ గురువారం బంగ్లాదేశ్ తో, ఆదివారం పాక్ తో తలపడనుంది. ఇప్పటికే దుబాయ్ లో ఉంది జట్టు. బహుశా పాక్ తో మ్యాచ్ కు ముందు మన ఆటగాళ్లకు కుటుంబంతో గడిపే చాన్స్ దొరుకుతుందేమో? అదే జరిగితే మెగా సమరానికి ముందు మంచి రిలాక్సేషన్ అనుకోవాలి.