హైదరాబాద్ లో దారుణ హత్య.. పారిశ్రామికవేత్తను చంపేసిన మనమడు
హైదరాబాద్ మహానగరంలో దారుణ హత్య ఒకటి వెలుగు చూసింది. పేరున్న ప్రముఖుడ్ని సొంత మనమడు అత్యంత దారుణంగా.. క్రూరంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది
హైదరాబాద్ మహానగరంలో దారుణ హత్య ఒకటి వెలుగు చూసింది. పేరున్న ప్రముఖుడ్ని సొంత మనమడు అత్యంత దారుణంగా.. క్రూరంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన (86)ను ఆయన మనమడు అత్యంత క్రూరంగా హత్య చేశారు. దీనికి ఆస్తి తగాదాలే కారణంగా భావిస్తున్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో చోటు చేసుకుంటున్న ఆస్తి తగదాలే ఈ దారుణ ఘటనకు కారణంగా భావిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల్ని చూస్తే.. వెల్జాన్ కంపెనీకి ఇటీవల ఒక డైరెక్టర్ గా వెలమాటి చంద్రశేఖర జనార్ధన్ పెద్ద కుమార్తె కొడుకు శ్రీక్రిష్ణను కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. మరో కుమార్తె కొడుకైన కిలారు కీర్తితేజ (29)కు రూ.4 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కీర్తి తేజ తన తల్లి సరోజినీదేవితో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విసయంలో తాతతో వాగ్వాదానికి దిగాడు.
తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా. అదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73సార్లు పొడిచారు. అరుపులు.. కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కొడుకును వారించబోయారు. ఆమెపై నాదాడి చేసి కత్తితో నాలుగుచోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. రావొద్దని.. వస్తే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
సరోజినీదేవి జూబ్లీహిల్స్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాతను హత్య చేసిన కీర్తితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి మాదకద్రవ్యాలకు బానిస అయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు విషయానికి వస్తే.. ఆయన తన సొంతూరు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు.. తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్లు విరాళాలు ఇచ్చిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు విరాళాలు అందజేసిన ఆయన ఇంత దారుణంగా హత్యకు గురి కావటం.. అది కూడా సొంత మనమడి చేతిలో కావటం షాకింగ్ గా మారింది.