న్యూమెక్సికోలో కాల్పుల కలకలం : ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు

లాస్ క్రూసెస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం యంగ్ పార్క్‌లో ఒక ఈవెంట్ జరుగుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది.;

Update: 2025-03-23 04:12 GMT

అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి విషాదాన్ని నింపింది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని లాస్ క్రూసెస్ నగరంలో శనివారం జరిగిన సామూహిక కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని యంగ్ పార్క్ అనే సంగీత, వినోద వేదికలో ఒక కార్యక్రమం జరుగుతుండగా చోటుచేసుకుంది.

లాస్ క్రూసెస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం యంగ్ పార్క్‌లో ఒక ఈవెంట్ జరుగుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇద్దరు 19 ఏళ్ల యువకులు, ఒక 14 ఏళ్ల బాలుడు మృతి చెందారు.

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని, ప్రజల సహాయాన్ని కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు ఉంటే పోలీసులకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

లాస్ క్రూసెస్ నగరం దక్షిణ న్యూ మెక్సికోలో రియో గ్రాండే నది వెంబడి చివాహువాన్ ఎడారి ప్రాంతంలో, యూఎస్-మెక్సికన్ సరిహద్దుకు ఉత్తరాన సుమారు 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెక్సికోలో గతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆగ్నేయ మెక్సికోలోని విల్లాహెర్మోసా నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించడం గమనార్హం.

మరోసారి అమెరికాలో జరిగిన ఈ సామూహిక కాల్పుల ఘటన దేశంలో తుపాకీ నియంత్రణ చట్టాల ఆవశ్యకతను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనతో లాస్ క్రూసెస్ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Full View
Tags:    

Similar News