నాగబాబు కోసం బీజేపీ త్యాగం ?

బీజేపీ ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తోంది అన్నది తెలిసిందే. బీజేపీకి ఉన్న సీట్లు ఎనిమిది మాత్రమే.

Update: 2025-02-18 13:30 GMT

బీజేపీ ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తోంది అన్నది తెలిసిందే. బీజేపీకి ఉన్న సీట్లు ఎనిమిది మాత్రమే. కానీ బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. అంతే కాదు ఆ పార్టీ వరుసగా దేశంలోని అన్ని రాష్ట్రాలను గెలుచుకుంటూ అత్యంత బలమైన పొజిషన్ లో ఉంది. దాంతో కూటమిలో బీజేపీ మాట చెల్లుబాటు అవుతోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. గత నెలలో వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని ప్రచారం సాగింది. పైగా రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది. దాంతో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ విధమైన ఎత్తుగడలలో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అన్న చర్చ అయితే సాగింది.

ఈ నేపథ్యంలో బీజేపీకే ఈ ఖాళీ అయిన రాజ్యసభ సీటు వెళ్తుంది అని మొదట్లో గట్టి ప్రచారం సాగింది. అది కూడా మాజీ సీఎం గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ పొలిటికల్ గా రీ ఎంట్రీ చేయించి ఆయనకు ఇస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ ఈ మధ్యనే చిరంజీవి ఈ జన్మలో మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని స్పష్టం చేశారు.

అంతే కాదు తనకు బదులుగా తమ సోదరుడు పవన్ కళ్యాణ్ తన ఆశయాలను రాజకీయాల్లో నెరవేరుస్తారు అని కూడా చెప్పారు. దాంతో బీజేపీ మెగాస్టార్ మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే అవి కావు కుదరవు అని కచ్చితంగా రూఢీ అయినట్లు అయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి నల్లారి ఒక ఆప్షన్ గా ఉంది.

అయితే బీజేపీకి మంచి మిత్రుడిగా ఉన్న జనసేన ఈ సీటు కోరుతోంది. పైగా మెగా ఫ్యామిలీకే ఆ సీటు అడుగుతోంది అని అంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేయాలని బీజేపీ పెద్దలను కూటమి మిత్రులు కోరుతున్నారని తెలుస్తోంది. ఏపీ నుంచి ఇప్పటికి మూడు ఖాళీలలో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు రాజ్యసభకు వెళ్ళారు.

మరి కీలకమైన మరో మిత్రుడిగా జనసేనకు ఈసారి ఆఫర్ ఇవ్వడం న్యాయం ధర్మం అని కూడా అంటున్నారు. పైగా నాగబాబు ఆయన పార్టీ జనసేన ఇప్పటికే బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు త్యాగం చేశారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా నాగబాబుకే ఈ రాజ్యసభ కట్టబెట్టడం కూటమి ధర్మంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

కళ్ళు మూసుకుంటే మరో పదిహేను నెలలలో అంటే 2026 జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి అందులో నుంచి బీజేపీ తన వాటా తీసుకోవచ్చు అని అంటున్నారు. దీంతో బీజేపీ పెద్దలు కూడా పునరాలోచనలో పడ్డారు అని అంటున్నారు. నాగబాబుకే ఈ సీటు ఇచ్చేందుకు అయితే సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది అని అంటున్నారు.

మరో వైపు నాగబాబు కూడా రాజ్యసభకు వెళ్ళేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. 2028 జూన్ దాకా పదవీ కాలం ఉన్న ఈ ఎంపీ సీటును ఆయన బలంగా ఆశిస్తున్నారు అని అంటున్నారు. నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు ఆ మధ్య ప్రకటన చేసినా అది ఇపుడు అంత తొందరగా అయ్యే వ్యవహారంగా లేదని అంటున్నారు. కేవలం నాగబాబు కోసమే మంత్రి వర్గంలో మార్పులు చేయలేరని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఇంకా ఏడాది కూడా కాలేదని అందువల్ల ఇప్పట్లో మంత్రివర్గంలో చేరికలు అయినా మార్పులు అయినా ఉండవని అంటున్నారు.

అలా చూసుకుంటే నాగబాబుకు ఏ పదవీ దక్కక అన్యాయమే జరుగుతుందని అందుకే ఆయనను ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుని ఇచ్చి పెద్దల సభకు పంపించాలన్నదే తెలుగుదేశం అభిమతమని అంటున్నారు. పవన్ కూడా జాతీయ రాజకీయాల్లో తన సోదరుడు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. రేపటి రోజున కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా నాగబాబుకు పదవి దక్కుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ త్యాగం చేసి నాగబాబుకు ఈ సీటుని ఇస్తోంది అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News