మమ్మీ.. డాడీ.. మేం ఇప్పుడు రాలేం..భారతీయ అమెరికన్ల ప్రయాణం వాయిదా

నిబంధనల మార్పు, కఠిన ఇమ్మిగ్రేషన్, బహిష్కరణలు, విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై ప్రభావం రీత్యా జనవరి 20 వరకు ఒకటే టెన్షన్ టెన్షన్.

Update: 2025-02-18 20:30 GMT

సరిగ్గా నెల రోజుల కిందట అమెరికాలో చదువుతూ స్వదేశానికి వచ్చిన భారతీయ విద్యార్థుల్లో ఒకటే కంగారు.. కారణం.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడోనని..? అందుకే అమెరికాలోని చాలా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు తమ ఉద్యోగులు, విద్యార్థులను జనవరి 20వ తేదీలోపు తిరిగి రావాలని కోరాయి. నిబంధనల మార్పు, కఠిన ఇమ్మిగ్రేషన్, బహిష్కరణలు, విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై ప్రభావం రీత్యా జనవరి 20 వరకు ఒకటే టెన్షన్ టెన్షన్.

ఇప్పడు నాణేనికి మరోవైపు కనిపిస్తోంది. స్వదేశానికి రావాలనుకునే అమెరికాలోని భారతీయులకు మరో సమస్య ఎదురవుతోంది. అదే.. ఇంటర్వ్యూ మినహాయింపు అర్హతలో మార్పు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం వీసా గడువు ముగిసిన తేదీ నుంచి అర్హతను 48 నెలల నుంచి 12 నెలలకు మార్చారు. వీసా అపాయింట్‌ మెంట్‌ ను రీ షెడ్యూల్ చేయడం తొలిసారే ఉచితం. తర్వాతి నుంచి పెయిడ్. దీని ప్రభావం ప్రయాణం తేదీలపై పడుతోంది.

ఇప్పటికే బ్లాక్ చేసిన తేదీలతో వీసా ఇంటర్వ్యూల గందరగోళం మధ్య చాలా భారతీయ కుటుంబాలు ప్రయాణానికి వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ 1బి వీసా హోల్డర్లు అమెరికా అధికారుల నుంచి వీసా స్థితి, ఆమోదం సమయంతో సంబంధం లేకుండా యాదృచ్ఛికంగా సైట్ సందర్శనలను పొందుతున్నారు. బహిష్కరణ భయంతో చాలా మంది విద్యార్థులు తమ పార్ట్ టైమ్ ఉద్యోగాలను విడిచిపెట్టారు.

గందరగోళం, అనిశ్చితి మధ్య ఫిబ్రవరి, మార్చిలో.. స్వదేశానికి రావాలని ప్లాన్ చేసుకున్నవారు వెనక్కుతగ్గుతున్నారు. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, తమ ప్రణాళికలను వేసవికి వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News