పవన్ తో జగన్ రాజీ? వైసీపీ అధినేత టార్గెట్ మారిందా?

పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడమే ఎన్నికల్లో నష్టం చేసిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్న కారణంగానే ఆయన తన టార్గెట్ ను సవరించారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Update: 2025-02-18 21:30 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ టార్గెట్ మార్చుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చిన జగన్.. తాజాగా తన వైఖరి మార్చుకున్నారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు తగ్గించి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పైనే తన మొత్తం ఫోకస్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడమే ఎన్నికల్లో నష్టం చేసిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్న కారణంగానే ఆయన తన టార్గెట్ ను సవరించారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ వ్యూహాన్ని సవరించుకున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా పార్టీ పరిస్థితిని విశ్లేషించుకుంటున్న జగన్.. ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా జనసేనాని పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేవారు జగన్. పవన్ ను ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తన అధికారం పదిలం అనే భావన జగన్ లో కనిపించేదని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు అంటూ పవన్ పై విమర్శల వర్షం కురిపించేవారు. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని ఆరోపించేవారు. అయితే పవన్ విషయంలో శ్రుతి మించిన ఆరోపణలు చేయడం, వైసీపీ సోషల్ మీడియా కూడా జనసేనానినే లక్ష్యం చేసుకోవడం వల్ల జగన్ గన్ మిస్ ఫైర్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ అంచనాలు తలకిందులు అవ్వడమే కాకుండా పవన్, చంద్రబాబు మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ భావించేవారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ఎక్కువగా పవన్ కల్యాణ్ వెంట పడేవారు. కానీ, జగన్ ఊహకు భిన్నంగా ఆ ఇద్దరూ ఏకమవడంతో అధికారం వైసీపీ చేతుల నుంచి జారిపోయింది. ఎన్నికల అనంతరం కార్యకర్తలు, నాయకులతో పలుమార్లు మాట్లాడిన జగన్.. పవన్ విషయంలో విమర్శలు శ్రుతిమించాయనే విషయాన్ని గ్రహించారని అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు విజయవాడ వచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎంపై వీసమెత్తు మాట కూడా ఆడలేదు. కనీసం ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇది జగన్ లో మారిన వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా జగన్ ఎప్పుడూ డిప్యూటీ సీఎంపై విమర్శల దాడి చేసేవారని అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని, పవన్ ను రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా జరిగే లాభం కన్నా, నష్టమే ఎక్కువగా ఉంటోందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ అధినేతకు చెప్పి.. పవన్ విషయంలో కాస్త సడలింపు దోరణి అవలంబించాలని సూచించినట్లు చెబుతున్నారు. తమ కోరికను మన్నించి జగన్ మారారని తాజా ఇష్యూ నిరూపించిందని అంటున్నారు.

Tags:    

Similar News