రోహిత్​ శర్మకు ఏమైందో చెప్పండి? అభిమానులకు తెలుసుకొనే హక్కుంది..! గవాస్కర్​ కామెంట్లు

Update: 2020-10-28 06:15 GMT
భారత స్టార్‌ క్రికెటర్​ రోహిత్‌ శర్మను ఆస్ట్రేలియా టూర్​ నుంచి  పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. రోహిత్​ శర్మకు ఎక్కడ గాయమైంది? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటీ? అని చెప్పకుండా బీసీసీఈ అతడిని తప్పించడం సరికాదని పలువులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్​ సునీల్​ గవాస్కర్​ స్పందించారు. రోహిత్​ ఫిట్‌నెస్‌ గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకునే హక్కు అభిమానులకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అతని గాయం తీవ్రతను వెల్లడించే విషయంలో బీసీసీఐ మరింత పారదర్శకత చూపించాల్సిందని ఆయన అన్నారు.

 ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ జట్టులో రోహిత్​కు స్థానం దక్కలేదు. రోహిత్​ ఫిట్​నెస్​ను తాము పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన కొద్దిసేపటికే ఐపీఎల్​ టీమ్​ ముంబై ఇండియన్స్​ ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఆ వీడియోలో రోహిత్​ ప్రాక్టీస్​ చేస్తున్నాడు. దీంతో అభిమానులకు అనుమానాలు తలెత్తాయి. ఓకవేళ రోహిత్​కు నిజంగానే తొడ కండరాల వద్ద గాయం అయ్యిఉంటే అతడు ఎలా ప్రాక్టీస్​ చేస్తున్నాడని పలువురు సోషల్​మీడియాలో కామెంట్లు పెట్టారు.

ఈ నేపథ్యంలో సునీల్​ గవాస్కర్​ స్పందించారు ‘ ముంబై ఇండియన్స్​ టీం యాజమాన్యం .. తమ జట్టు కెప్టెన్​ గాయం విషయాలు బయటకు చెప్పిఉండకపోవచ్చు. వాళ్ల వ్యూహం వాళ్లది. కానీ బీసీసీఐకి వచ్చిన ఇబ్బంది ఏమిటి? రోహిత్​కు గాయమైందని.. అందుకే మేం ఎంపిక చేయలేదని చెబితే పారదర్శకంగా ఉండేది. వాళ్లు స్పందింకపోవడం వల్ల ముంబై ఇండియన్స్​ రిలీజ్​ చేసిన వీడియోనే సరి అయినదని రోహిత్​ అభిమానులు భావించే అవకాశం ఉన్నది. అందువల్ల బీసీసీఐ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి.  సగటు భారత క్రికెట్‌ అభిమానికి తమకు ఇష్టమైన క్రికెటర్‌ గురించి తెలుసుకునే హక్కు ఉంది. అతను ముంబై ఇండియన్స్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన మాట వాస్తవమే అయితే... అతని గాయం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా అంత తీవ్రమైనదే అయితే అతను కనీసం ప్యాడ్‌లు కూడా కట్టుకోడు’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 18న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
Tags:    

Similar News