న్యాయమూర్తుల సత్తా చాటేవి తీర్పులేః సీజేఐ

Update: 2021-07-01 12:30 GMT
న్యాయ‌మూర్తులు ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కుండా, స్వ‌తంత్రంగా నిల‌బ‌డి ప‌నిచేయ‌డం అత్యంత ముఖ్య‌మని, వారి స‌త్తాను ప‌రీక్షించ‌డానికి వారు చెప్పే తీర్పులే అస‌లైన కొల‌మానాలు అని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. జ‌స్టిస్ పి.డి. దేశాయ్ 17వ స్మార‌కోప‌న్యాస కార్య‌క్ర‌మంలో మాట్లాడిన సీజేఐ.. న్యాయ‌మూర్తుల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.

చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అని చెప్ప‌డం అంటే.. అంద‌రికీ స‌మానంగా న్యాయం అందుబాటులో ఉంచ‌డ‌మేన‌ని అన్నారు. మ‌న దేశంలో చ‌ట్ట‌బ‌ద్ధ పాల‌న‌కు ఇదే మూల సూత్ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. నిర‌క్ష‌రాస్య‌త‌, పేద‌రికం వంటి బ‌ల‌హీన‌త‌ల కార‌ణంగా పేద‌లు త‌మ హ‌క్కుల‌ను అనుభ‌వించ‌లేక‌పోతే.. స‌మాన‌త్వ సిద్ధాంతానికి అర్థ‌మే లేద‌ని తేల్చి చెప్పారు.

మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడుతూ.. కేవ‌లం వారి హ‌క్కుల కోస‌మే కాకుండా.. స‌మాజ హితానికి సైతం స్త్రీ సాధికార‌త ఎంతో ముఖ్య‌మ‌ని అన్నారు. ప్ర‌భుత్వ అధికారాల‌ను త‌నిఖీ చేసేందుకు న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉండాల‌ని సీజేఐ స్ప‌ష్టం చేశారు. చ‌ట్టాల రూపంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నియంత్రించ‌డం స‌రికాద‌ని అన్నారు. ఇందుకు వ్య‌తిరేకంగా జ‌రిగితే మాత్రం రూల్ ఆఫ్ లా అనేది ఒక భ్ర‌మ‌గానే మిగిలిపోతుంద‌ని అన్నారు.

ఇక‌, దేశంలో ప్ర‌భుత్వాల పాల‌న‌పైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 17 సార్లు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే.. అధికార పార్టీల‌ను, కూట‌ముల‌ను ప్ర‌జ‌లు ఎనిమిది సార్లు తిర‌స్క‌రించార‌ని చెప్పారు. అయితే.. పాల‌కుల‌ను మార్చినంత మాత్రాన దౌర్జ‌న్యాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌న్న హామీ మాత్రం లేద‌ని అన్నారు. చ‌ట్ట స‌భ‌లు రూపొందించే చ‌ట్టాలు రాజ్యాంగ సూత్రాల‌ ప్ర‌కారం ఉండేలా చూసే ప్రాథ‌మిక వ్య‌వ‌స్థ‌.. న్యాయ వ్య‌వ‌స్థేన‌ని చెప్పారు. రాజ్యాంగ మూల సూత్రాల ప్ర‌కార‌మే సుప్రీం కోర్టు ప‌నిచేస్తుంద‌ని, దాన్ని పార్ల‌మెంటు నియంత్రించ‌లేద‌ని సీజేఐ స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News