సుప్రీంకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్ ఆయనేనా?

Update: 2019-10-18 12:13 GMT
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ కాలం వచ్చే నెల 17తో ముగియనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ జస్టిస్ ఎంపిక ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రంజన్ గొగోయ తరువాత ఎవరు సీజేఐ అవుతారన్న విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత సీజేఐ తన తరువాత ఈ పదవి చేపట్టాల్సిన న్యాయమూర్తిగా తన సిఫారసును పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో ఆయన తన తదుపరి శరద్ అరవింద్ బాబ్డేను సీజేఐగా నియమించాలంటూ ఆయన కేంద్రానికి సూచించారు.

తాను వచ్చే నెల 17న పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ గా శరద్ అరవింద్ బాబ్డేను సిఫార్సు చేస్తూ, కేంద్రం అభిప్రాయం చెప్పాలని ప్రస్తుత సీజే రంజన్ గొగొయ్ కోరారు. తన తరువాత సీనియారిటీలో బాబ్డే రెండో స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, జస్టిస్ బాబ్డే, గతంలో మధ్య ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2021, ఏప్రిల్ 23 వరకు ఆయన పదవీ కాలం ఉంది.

1956, ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన బాబ్డే, నాగపూర్ యూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆపై 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 2013 నుంచి సుప్రీంకోర్టులో విధులను నిర్వహిస్తున్నారు. కాగా సీజేఐ స్వయంగా సిఫారసు చేయడంతో ఆయనపై గౌరవంతో బాబ్డే పేరుకు కేంద్రం ఆమోదం చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News