రోజా కేసులో కీల‌క తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

Update: 2017-07-06 11:41 GMT
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంలో ఒకే రోజు రెండు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీలో డైన‌మిక్ ఎమ్మెల్యేలుగా పేరొందిన ఆర్కే రోజా - ఆళ్ల‌ రామ‌కృష్ణారెడ్డిల విష‌యంలో ఒక‌రికి ఉప‌శ‌మ‌నం ద‌క్క‌గా...మ‌రొక‌రికి నోటీసులు అందాయి. వైసీపీ మ‌హిళ‌ ఎమ్మెల్యే రోజాను శాసనసభనుంచి సస్పెండ్ చేసిన కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రోజాకు సూచించింది.

సుప్రీంకోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా  రోజా తరఫు న్యాయవాది వాదిస్తూ క్షమాపణ పత్రాన్ని సభాపతికి పంపించామని చెప్పారు. కాగా రాష్ట్రప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ క్షమాపణ పత్రం తమకు అందలేదని చెప్పారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి రోజా క్షమాపణ పత్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అందజేసింది. దీనిని సంబంధిత శాఖలకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసు హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది.

మ‌రోవైపు గుంటూరు జిల్లా పెనుమాకలో సీఆర్డీఏ ఉపకలెక్టర్‌ ను దూషించిన కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ లో హాజరై ఎమ్మెల్యే నోటీసులు తీసుకున్నారు. ఇటీవ‌ల పెనుమాక సీఆర్డీఏ సదస్సులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దురుసుగా ప్రవర్తించార‌నే అభియోగంపై ఈ కేసు దాఖ‌లు చేశారు. సీఆర్డీఏ స‌ద‌స్సులో భాగంగా తమ పట్ల ఎమ్యెల్యే దురుసుగా ప్రవర్తించారని సీఆర్దీఏ అధికారులు స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి తాజాగా నోటీసులు అందించారు.

గ‌త‌న నెల‌లో సీఆర్‌ డీఏ అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి భూసేక‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ స‌మావేశాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. పెనుమాకలో భూసేకరణ నోటిపికేషన్‌ ఇచ్చిన తరువాత మూడు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ రైతులంతా కోర్టును ఆశ్రయించారని తెలిపారు. దీంతో న్యాయస్థానం రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రైతులు మీటింగ్‌లో వారి అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా రాసిచ్చారన్నారు. ``మా అభ్యంతరాలపై మీకున్న అభిప్రాయాలు చెప్పండి. అదే విధంగా మినిట్స్‌ బుక్‌ లో ఎంటర్‌ చేసుకోండి`` అని రైతులు కోరితే డిప్యూటీ కలెక్టర్ ``మినిట్స్‌ బుక్‌లో రాయం..  హైకోర్టు తీర్పును లెక్క చేయం. మీరు కాగితాలు ఇచ్చిపోండి అని చెప్పార‌ని, దీంతో స్థానిక రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు`` అని ఆర్కే స్పష్టం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్‌ చట్టబద్ధంగా లేకపోవడంతో రైతులు అడ్డుకున్నామ‌ని ఆర్కే తెలిపారు. బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించి తీరుతామని ఆర్కే అదే స‌మ‌యంలో ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News