కమ్యూనిస్ట్ లు తమ దేశభక్తిని చెప్పుకోవాల్సి వచ్చిందే

Update: 2016-02-23 04:09 GMT
కమ్యూనిస్ట్ లు ఆత్మరక్షణలో పడ్డారా? ఎప్పుడూ లేంది.. తమకున్న దేశభక్తి గురించి చెప్పుకోవాల్సి వచ్చిందా? ప్రపంచ పౌరులం అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ప్రపంచంలోని కమ్యూనిస్ట్ లు అంతా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరించే కామ్రేడ్స్ తొలిసారి తమ గురించి తాము.. తమకున్న దేశభక్తి ఎంతన్నది వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందా? అంటే అవునని చెప్పాలి. ఢిల్లీలోని జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలు.. వారి వ్యవహరించిన పరిస్థితి పుణ్యమా అని కామ్రేడ్లు ఇప్పుడు అడ్డంగా బుక్ అయిన పరిస్థితి.

జేఎన్ యూ వర్సిటీలో ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించటం.. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయటం.. అదుపులోకి తీసుకొని జైలుకు తరలించటం లాంటివి జరిగాయి. దీన్ని వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కమ్యూనిస్ట్ నేతలు ఉన్నారు. ఇక.. కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన డి.రాజా కుమార్తె.. ఈ కార్యక్రమానికి హాజరు కావటం కలకలం రేపింది. మరోవైపు ఈ వైఖరిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

ఉగ్రవాదికి సంస్మరణ సభను నిర్వహించటం ఏమిటి? దానికి రాజకీయ పార్టీలు మద్దుతు పలకటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. ఈ వైఖరిని నిలదీస్తోంది. అయితే.. బీజేపీ వాదనను పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించిన కమ్యూనిస్ట్ లకు కమలనాథులు వినిపిస్తున్న వాదన ప్రజల్లోకి వెళ్లటం.. కమ్యూనిస్ట్ లకు దేశభక్తి లేదా? అన్న ప్రశ్న తలెత్తేలా మారటంతో కామ్రేడ్లు ఇరుకున పడిన పరిస్థితి.

నిజానికి ఈ వ్యవహారంలోతొలుత యాక్టివ్ గా వ్యవహరించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. కొద్దిరోజులకే ఈ విషయంపై స్పందించటం మానేశారు. జేఎన్ యూ వ్యవహారంలో పెల్లుబుకుతున్న భావోద్వేగం తమను దెబ్బ తీస్తుందని గుర్తించి ఆయన వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కమ్యూనిస్ట్ లు దిద్దుబాటు చర్యల్లోకి వెళ్లారు. ఇదే.. ఇప్పుడు వారి నోట.. తమకున్న దేశభక్తి ఎంతన్న విషయాన్ని చెప్పేలా చేస్తోంది. తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతూ.. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తే దేశం విడిచిపోవాలా? ఈ దేశంలో ఎవరుండాలనేది మీరు నిర్ణయిస్తారా? కాషాయజెండా పడితే మీరు దేశభక్తులు.. ఎర్రజెండా పడితే దేశద్రోహులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించటమే కాదు.. నకిలీ దృశ్యాలు సృష్టించి..జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య మీద తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

నిజమైన దేశద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారేనని.. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని నిజమైన దేశభక్తిని చాటుకున్నది కమ్యూనిస్టులేనని సురవరం చెప్పుకున్నారు. భగత్ సింగ్ చనిపోవటానికి ఒక్కరోజు ముందు.. ‘‘నేనెందుకు నాస్తికున్ని’’ అనే పుస్తకం రాశారని.. అలాంటి భగత్ సింగ్ ను బీజేపీ నాయకుడిగా చెప్పుకుంటున్నారని.. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేకు విగ్రహాలుపెడుతున్న బీజేపీ నేతలది దేశభక్తా? అంటూ విరుచుకుపడిన ఆయన.. తమకు దేశభక్తి లేదనటాన్ని తప్పు పట్టారు. సురవరం మాటల్నే తీసుకుంటే.. భగత్ సింగ్ ను బీజేపీ నేతగా ఆ పార్టీ ఎప్పుడూ చెప్పుకున్నది లేదు. కాకుంటే.. ఆ పార్టీ కీర్తించే వారిలో భగత్ సింగ్ ఒకరన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక.. గాంధీని చంపిన గాడ్సేకు బీజేపీ నేతలది దేశభక్తా? అని ప్రశ్నిస్తున్న సురవరం.. అలాంటి వైఖరిని బీజేపీ నేతలంతా తప్పు పట్టటమే కాదు.. అలాంటి పద్ధతి సరికాదని ఖండించారు కూడా. కానీ.. అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్న సురవరం మాటల్ని చూస్తుంటే.. కామ్రేడ్లు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో ఇట్టే తెలుస్తుంది.
Tags:    

Similar News