అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు వద్దంటున్న సంఘ్

Update: 2016-03-14 04:04 GMT
రిజర్వేషన్ల తేనెతుట్టెను సంఘ్ పరివార్ కదిపింది. తాజాగా రిజర్వేషన్ల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించిన సంఘ్.. సంపన్న వర్గాలు చేస్తున్న డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదంటూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. అదే సమయంలో రిజర్వేషన్లు అవసరమైన వెనుకబడిన తరగతుల వారు నిజంగా వాటి కారణంగా లబ్ధి పొందుతున్నారో లేదో తెలుసుకోవటానికి సమగ్ర సర్వే నిర్వహించాలన్న మాటను చెప్పటం గమనార్హం. మూడు రోజుల పాటు సాగిన ఆర్ ఎస్ ఎస్ జాతీయ సదస్సు చివరి రోజున పలు కీలక అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి.. సంపన్న వర్గాల వారు రిజర్వేషన్లు కోరుకోవటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అలాంటి వారు తమ హక్కులను వదులుకొని బలహీన వర్గాల వారి ఉన్నతికి సాయం చేయాలని కోరటం గమనార్హం. సూటిగా ప్రస్తావించనప్పటికీ.. ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లు కావాలంటూ జాట్ లు చేసిన ఆందోళనను పరోక్షంగా ప్రస్తావించిన జోషీ తాజా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

వెనుకబడిన కులాలు.. బలహీన వర్గాలకు సాయం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నభావనను వ్యక్తం చేశారు. సంఘ్ చేసిన తీర్మానంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అమలవుతున్నరిజర్వేషన్ల స్థానే.. కులం ఏదైనా కానీ ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు దక్కాలన్న వాదనను వినిపించకుండా కొన్ని వర్గాలు మాత్రమే రిజర్వేషన్లకు అర్హులన్నట్లుగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సమాజంలో నెలకొన్న తారతమ్యాలు తీర్చేందుకు.. సామరస్యాన్ని తీసుకురావటానికి అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా రిజర్వేషన్లు ఉండాలే కానీ.. కొన్ని వర్గాలకు మాత్రమే అన్నట్లుగా ఉండటం కాలం చెల్లిన వాదనగా చెప్పొచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్లుగా సంఘ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించటం.. తన వాదనను వినిపించటం ‘కొందరి బాట’ను పట్టటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టే కులం ఏదైనా కావొచ్చు.. రిజర్వేషన్ ఫలాలు కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే లభించాలే తప్ప.. అందరికి కాదన్న వాదనను సంఘ్ ఎందుకు పట్టించుకోనట్లు..?
Tags:    

Similar News