గ్రేటర్ వార్.. తెలంగాణ డీజీపీ వార్నింగ్

Update: 2020-11-26 16:50 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మత విద్వేశాలు రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించడంతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆ మేరకు హెచ్చరికలు పంపారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన డీజీపీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ నేతలపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశించిన రెండోరోజే డీజీపీ చేసిన ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వ్యాఖ్యలు చేసిన నేతలపై కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటివరకు రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్నవారే మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే ఓయూ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.

హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన బాధ్యత అని డీజీపీ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ లో పాల్గొనాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం కోసం పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని డిజిపి తెలిపారు. మత ఘర్షణలు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు తమకు సమాచారం ఉందని.. అలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

సోషల్ మీడియాపై కూడా పోలీసులు నిఘా పెట్టారని.. మత విద్వేశాలు రెచ్చగొట్టే పోస్టులు సృష్టించే వారిపై సైతం కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ప్రజలు సోషల్ మీడియా రూమర్స్ ను నమ్మవద్దని సూచించారు. ఎక్కడ ఏం జరిగినా పోలీసుల టీంలను సిద్ధం చేశామని తెలిపారు.
Tags:    

Similar News