బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌రిపూర్ణానంద‌?

Update: 2018-09-09 06:36 GMT
తెలంగాణ‌లో హిందుత్వ గ‌ళాన్ని వినిపిస్తున్న స్వామి పరిపూర్ణానంద గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.  నగర బహిష్కరణ తర్వాత 55 రోజుల అనంతరం స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త్వరలోనే తాను తెలంగాణలోని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతాను అని ప్రకటించిన స్వామీజీ.. ఎవడు ఆపుతాడో చూస్తానని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా...బాసర నుంచి భద్రాచలం దాకా కాషాయం రెపరెపలాడేలా కార్యక్రమాలు చేపడుతానని, అంతేకాదు తెలంగాణలో ప్రతి వ్యక్తి నోటి నుంచి భారత్ మాతాకీ జై అనే రోజు వస్తుందన్నారు.భారత దేశాన్ని హిందుస్తాన్ అంటారని.. కానీ ఇక్కడ హిందువులకే స్థానం లేని దుస్థితిని మన నాయకులు తీసుకొచ్చారని ప‌రిపూర్ణానంద‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువు మాట్లాడితే బహిష్కరిస్తున్నారని వాపోయారు. కమ్యూనిస్టుల పాలనలో కూడా ఇలాంటి దారుణాలు జరగవన్నారు.

రాత్రి పగలు తేడా లేకుండా కాషాయాన్ని ఒంటి మీద వేసుకుని గల్లీ గల్లీ తిరిగితే ఒక్క ఓల్డ్ సిటీ ఏంటి తెలంగాణ మొత్తాన్ని గోల్డ్ సిటీగా మార్చుకోవచ్చని ప‌రిపూర్ణానంద‌ అన్నారు. గతం గురించి మాట్లాడితే తనను బహిష్కరించారని.. కానీ కొన్ని రోజుల్లో భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నానని, అప్పుడు  ఏ శిక్ష వేస్తారో చూస్తానని స్వామీజీ అన్నారు. తనకు ఉరిశిక్ష వేసినా వెనకడుగు వేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తు గురించి మాట్లాడటమే కాదు భవిష్యత్తు రాసే దిశగా అడుగులు వేయబోతున్నామని స్వామి పరిపూర్ణానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా స్వామి ప‌రిపూర్ణానంద ఇలాంటి హాట్ హాట్ కామెంట్లు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కొత్త వాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చారు. త్వ‌ర‌లో ఆయ‌న బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నార‌ని అంటున్నారు.

హిందూత్వ వాద‌న‌ను బ‌లంగా వినిపించేందుకు బీజేపీకి స‌రైన నాయ‌కుడు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని స్వామి ప‌రిపూర్ణానంద అభిమానులు పేర్కొంటున్నారు. బీజేపీని న‌డిపించేందుకు స‌రైన నాయ‌కుడిగా రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆయ‌న బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని సోష‌ల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఓ వైపు రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ హైద‌రాబాద్ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా...మ‌రోవైపు ఆయ‌న‌కు అధ్య‌క్ష స్థానం అనే ప్ర‌చారం హాట్ టాపిక్‌గా మారుతోంది.
Tags:    

Similar News