దుర్గ‌గుడి పూజ‌ల‌పై స్వామి ఫైర్‌..ఈవో బ‌దిలీ

Update: 2018-01-03 10:18 GMT
బెజవాడ దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి అపరిచిత వ్యక్తుల పూజల ఎపిసోడ్‌ క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. డిసెంబర్ 26 అర్థరాత్రి గర్భాలయంలో తమిళ పూజారులతో పూజలు చేయించారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈవో సూర్యకుమారి డైరెక్షన్‌ లోనే ఈ పూజలు నిర్వహించారని విమర్శలు వినిపించాయి. ఆ రోజు అర్థరాత్రి సమయంలో ఆలయానికి సంబంధం లేని వ్యక్తి కాషాయ వస్త్రాల్లో గర్భగుడి దగ్గర ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో ఈ ఆరోపణలు బలం పుంజుకున్నాయి. ఈ ఎపిసోడ్‌పై మ‌రో మ‌లుపు తిరిగింది. ఈవో బ‌దిలీకి కార‌ణ‌మైంది.

బెజవాడ ఇంద్రకీలాద్రిని తాంత్రిక పూజల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. తాంత్రిక పూజ‌ల ఎపిసోడ్‌లో ఈవో సూర్యకుమారిపై ఆరోపణలు ఒకవైపు.. ప్రధానార్చకుడి బదిలీ మరోవైపు. అధికార, ప్రతిపక్షాల వాదోపవాదనలు... ఇలా ఇంద్రకీలాద్రి రగడ ఏపీలో కాక రేపింది. విజయవాడ దుర్గగుడిలో ఈ స‌మయంలో తాంత్రిక పూజలపై  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆవేదన వ్యక్తం చేశారు. తాంత్రిక పూజలు చేసి ఆంధ్రప్రదేశ్ ను ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ పూజలపై ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు. ఈ ఘటనపై కనీసం నిజనిర్ధారణ కమిటీ వేయలేదని స్వరూపానంద ఆక్షేపించారు. దేవాలయాల పరిరక్షణ కోసం అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు.

కాగా, ఈవో సూర్యకుమారి ఈ ప‌రిణామంపై స్పందిస్తూ ఆలయంలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదన్నారు. ఆ సమయంలో ఆలయాన్ని శుద్ది చేయించామని చెప్పారు. గుడి మూసిన తర్వాత మళ్లీ పూజలు చేయడం ఆగమశాస్త్రానికి విరుద్ధమని తెలియదని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని ఈవో సూర్యకుమారి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా అనధికార వ్యక్తులను గుడిలోకి తీసుకెళ్లిన ప్రధానార్చకులు బద్రీనాథ్‌కు మెమో జారీ చేసి.. ఆయన్ను కొండ కింద ఆలయానికి బదిలీ చేశారు.

మ‌రోవైపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అర్థరాత్రి పూట ప్రత్యేక పూజలకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకుమారిపై వేటు పడింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం, కొత్త వ్యక్తులు గర్భగుడిలో సంచరించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన దేవాదాయ శాఖ, ఆమెను తక్షణం ఈ ప‌దవి నుంచి తొలగిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువరించింది. వెంటనే సింహాచలం దేవస్థానంలో ఈఓగా పని చేస్తున్న రామచంద్ర మోహన్ ను దుర్గగుడి అధికారిగా నియమిస్తున్నామని జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. వెంటనే ఆయన విజయవాడ దుర్గమ్మ గుడిలో రిపోర్టు చేసి బాధ్యతలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దుర్గగుడి వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు సైతం స్పందించారు. ఆలయంలో అర్థరాత్రి ఎలాంటి పూజలు జరగలేదని - అలంకరణ మాత్రమే చేశారని చెప్పారు. వేరే ఆలయ అర్చకుడు గర్భాలయంలోకి ప్రవేశించడం నిజమేనని.. అతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు.. అర్థరాత్రి దుర్గగుడిలో పూజలు జరగడం రాజకీయంగానూ కలకలం రేపింది. లోకేశ్‌ కోసమే తాంత్రిక పూజలు చేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి పూజలపై పోలీసులు సైతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. భద్రీనాథ్‌ తో ఉన్న వ్యక్తిని కృష్ణాజిల్లా విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాగా గుర్తించారు.
Tags:    

Similar News