స్విగ్గీ వార్షిక నివేదిక వచ్చేసింది.. బిర్యానీ.. సమోసానే టాప్

Update: 2022-12-16 08:30 GMT
ఏడాది చివరకు వచ్చేశాం. మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇలాంటి వేళ.. ఈ ఏడాది మొత్తంగా ఏం జరిగింది? ఏం చేశాం? లాంటి ప్రశ్నల్ని ఎవరికి వారు సంధించుకోవటం మామూలే.

ఇక.. సంస్థలైతే వార్షిక పనితీరును మదింపు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వేళలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తాజాగా తనకు సంబంధించిన డేటాను షేర్ చేసింది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ టాప్ లో నిలుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వార్షిక రిపోర్టులో సదరు సంస్థ తనకు సంబంధించిన వివరాల్ని డేటాను పరిశీలించి వెల్లడించింది.

రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం అత్యధిక ఆర్డర్లు చికెన్ బిర్యానీకి ఫస్ట్ ప్లేస్ దక్కింది. రెండో స్థానం మసాలా దోశెకు లభించినట్లుగా కంపెనీ పేర్కొంది. తమ వద్ద ఆర్డర్ అయిన వాటి ప్రకారం చూస్తే.. సెకనుకు 2.28 చికెన్ బిర్యానీలు ఆర్డర్లుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లుగా వార్షిక రిపోర్టులను విడుదల చేస్తున్న స్విగ్గీ.. ఏడేళ్లుగా చికెన్ బిర్యానీకే ఫస్ట్ ప్లేస్ రావటం గమనార్హం.

చికెన్ బిర్యానీ ఆర్డర్లు టాప్ స్థానంలో నిలవగా రెండో స్థానంలో మసాలా దోశె.. తర్వాతి స్థానాల్లో చికెన్ ఫ్రైడ్ రైస్.. పన్నీర్ బటర్ మసాలా.. బటర్ నాన్.. వెజ్ ఫ్రైడ్ రైస్.. వెజ్ బిర్యానీ.. తందూరి చికెన్ లు ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చాయి. స్వదేశీ వంటల్లో బిర్యానీ టాప్ స్థానంలో నిలిస్తే.. విదేశీ రుచుల్లో పాస్తా.. పిజా.. మెక్సికన్ బౌల్.. స్పైసీ రొమెన్  ను ఎక్కువగా ఆర్డర్ చేశారని తేల్చింది.

ఇక.. స్నాక్స్ విషయానికి వస్తే సమోసా టాప్ ప్లేస్ లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో పాప్ కార్న్.. పావ్ బాజీ.. ఫ్రెంచ్ ప్రైస్.. గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. డిజర్ట్ విషయానికి వస్తే గులాబ్ జామ్ మొదటి స్థానంలో నిలిస్తే.. రస్ మలయ్.. చాకోలావా కేక్.. రసగుల్లా.. చాకోచిప్స్.. ఐస్ క్రీమ్ లు టాప్ ప్లేస్ లో ఉండటం గమనార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News