టి20 ప్రపంచ కప్.. ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ భారీ షాక్

Update: 2022-10-22 11:30 GMT
టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్ సూపర్ 12 శనివారం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఫేవరెట్, డిఫెండింగ్ చాంపియన్ ఆతిథ్య ఆస్ట్రేలియాకు దాయాది న్యూజిలాండ్ భారీ షాక్ ఇచ్చింది.
ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీ ప్రధాన రౌండ్ ప్రారంభమే.. సంచలనంగా మారింది. తొలిసారిగా స్వదేశంలో ఆతిథ్యం
ఇస్తున్న ఆసీస్ కు ప్రపంచ కప్ ప్రయాణం ఎంత కష్టమో తెలిసొచ్చే ఫలితం దక్కింది. టాస్ గెలిచి.. ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించి ఆ జట్టు పెద్ద తప్పు చేసింది. తొలుత బౌలింగ్ లో
తర్వాత బ్యాటింగ్ లో విఫలమై 89 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అసలేం జరిగింది...?సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సూపర్ 12 తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆసీస్ కెప్టెన్ ఫించ్ టాస్ గెలిచి కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్స్లులు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలెన్ పిడుగుల్లాంటి షాట్లతో
విరుచుకుపడితే, కాన్వే చివరికంటా క్రీజులో నిలిచి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు.

వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సులు కొట్టడమే కాక.. వికెట్ల మధ్య చకచకా పరుగులు తీస్తూ సాగిపోయాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్) రాణించకున్నా.. గ్లెన్ ఫిలిప్స్ (10 బంతుల్లో 12, 2 ఫోర్లు) నిలవలేకపోయినా.. కాన్వే మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు కదిలించాడు. చివర్లో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 26, 2 సిక్స్లులు) మెరుపులతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 200 పరుగులు చేసింది.

తేలిపోయిన కంగారూలు కళ్లెదుట ఉన్న భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారీ భాగస్వామ్యాలు అవసరమైన స్థితిలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (6 బంతుల్లో 5, 1 ఫోర్) ను బ్యాడ్ లక్ వెంటాడింది. పేసర్ టిమ్ సౌతీ విసిరిన బంతి అతడి ప్యాడ్ కు తగిలి వెనక్కి వెళ్లి బ్యాట్ కు తగిలి వికెట్ల మీద పడింది. కెప్టెన్ ఫించ్ (11 బంతుల్లో 13, 1 ఫోర్, 1 సిక్స్) పేవల ఫామ్ కొనసాగింది.

కొంత కాలంగా పరుగుల లేమితో బాధపడుతున్న అతడు సిక్స్, ఫోర్ కొట్టి ఎదురుదాడి చేసేలా కనిపించినా.. స్పిన్నర్ శాంటర్న్ బౌలింగ్లో తేలికైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 16, 2 ఫోర్ల, సిక్స్) కథ తొందరగానే ముగిసింది. మెరుపు వీరుడు మ్యాక్స్ వెల్ (20 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే, ఓ బ్యాట్స్ మెన్ కూడా నిలకడా ఆడకపోవడం ఆస్ట్రేలియాను ఓటమిపాల్జేసింది. ఫించ్, మ్యాక్స్ వెల్ పేలవ ఫామ్.. మిడిలార్డర్ లో నాణ్యమైన బ్యాట్స్ మెన్ లేకపోవడం ప్రతికూలమైంది.

కివీస్ ముందు.. బ్యాటర్లు.. తర్వాత బౌలర్లు ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్ రౌండ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తొలుత బ్యాటర్లు అద్భుతంగా ఆడగా.. తర్వాత బౌలర్ల క్రమశిక్షణతో బంతులేసి ఆస్ట్రేలియా పని పట్టారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ భారీ షాట్లు కొడుతున్నా.. కీలక సమయంలో ఔట్ చేసి పుంజుకొన్నారు. కివీస్ పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్ 24/2, సౌథీ 6/3 ధాటికి కంగారూ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. స్పిన్నర్ శాంటర్న్ (3/31) మిగతా పని పూర్తి చేశాడు. ఫేవరెట్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై కివీస్ ఆడిన తీరు చూస్తే ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపినట్లే అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News