అలా తాకితే లైంగిక వేధింపులు కాదన్న కోర్టు.. తీర్పుపై తాప్సీ అసహనం

Update: 2021-01-25 01:30 GMT
లైంగిక వేధింపుల కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీనటి తాప్సి పన్ను అసహనం, తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి తీర్పులు విన్నప్పుడు తనకు మాటలు కూడా రావడం లేదని ఆవేదన చెందారు. ‘చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇలాంటి తీర్పుల గురించి తెలిసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు’ అంటూ తాప్సీ ఆక్షేపించారు.

లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు రెండు రోజుల క్రితం ఓ తీర్పునిచ్చింది. మహిళల శరీరానికి పురుషుడి శరీరం తాకితేనే అది లైంగిక వేధింపుల కేసు కిందకు వస్తుందని చెప్పింది. అలా కాకుండా ఆమె దుస్తులను తాకినంత మాత్రాన అది లైంగిక వేధింపుల కిందకు రాదని సంచలన తీర్పునిచ్చింది న్యాయ‌స్థానం.

సింగిల్ జడ్జ్ బెంచ్ న్యాయమూర్తి పుష్ప గనేదివాల ఈ మేరకు తీర్పునిచ్చారు. మైనర్ల విషయంలో వారి ఎద భాగాన్ని తాకినంత మాత్రాన అది లైంగికంగా వేధించినట్లు కాదని, దుస్తులు లేకుండా తాకితేనే లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ జూన్ పాల్ అనే యూజర్ షేర్ చేసిన ఓ ట్వీట్‌ను తాప్సీ రీట్వీట్ చేశారు. ఈ తీర్పుపై గాయని చిన్మయి మరింత ఘాటగా స్పందించారు. జూన్ పాల్ ట్వీట్‌నే షేర్ చేసిన చిన్మయి.. ‘మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది. అద్భుతంగా ఉంది కదా.. ఈ దేశం లైగింగ వేధింపులకు పాల్పడే వారికోసమే. వారి కోసం వారే ఏర్పాటు చేసుకున్నది’ అంటూ చిన్మయి కోట్ చేశారు.


Tags:    

Similar News