కొడాలి నానిపై చర్యలకు టీడీపీ నేతల ఫిర్యాదు

Update: 2020-09-09 17:30 GMT
ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను విమర్శించే క్రమంలో నాని పలు మార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమలపై నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తాజాగా తనకు మంత్రి పదవంటే లెక్కలేదంటూ నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. నాని భాషపై పలువురు టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగర కమిషనర్ కు నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులుకు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఫిర్యాదు చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొడాలి నాని మీడియా సాక్షిగా వాడుతున్న భాష అప్రజాస్వామికమనరి, నాని భాషను చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారని వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని, అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని, తనను కూడా చంపేస్తారా? అని ప్రశ్నించారు. నాని బూతులు విని ఆయన దగ్గరకు రావాలంటేనే భయపడుతున్నారని, నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారేమో అని వేచి చూశామని చెప్పారు. ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఫిర్యాదు చే్స్తున్నామని, డిజిపి బిజిగా ఉండడంతో సీపీని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. నానిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
Tags:    

Similar News