ఏపీలోని రాజకీయాలపై తెలంగాణ మంత్రి - టీడీపీలో ఓ వెలుగువెలిగిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికరంగా స్పందించారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయన్నారు. ఏపీలో అక్కడి పార్టీలు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని తలసాని ఆరోపించారు. తమ దిగజారుడు రాజకీయాలతో ప్రజలను పిచ్చి వాళ్ళుగా మార్చే యత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని కలిశారు...మరొకరు ఇంకెవరిని కలిశారు అనేదే అక్కడి పార్టీలకు ముఖ్యమైన అంశం కావడం దురదృష్టకరమని తలసాని వ్యాఖ్యానించారు.
ప్రజలను గందరగోళ పరచడానికి ఏపీలో పార్టీలు ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారని తలసాని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంతో వచ్చే ప్రయోజమేమిటని తలసాని ప్రశ్నించారు. `బీజేపీకి సొంతగా 273 మంది ఎంపీల బలం ఉంది. స్పెషల్ స్టేటస్ సాధించుకోవడానికి ఎన్నో ఫ్లాట్ ఫామ్ లు ఉన్నాయి. అయినా అవిశ్వాసం అంటున్నారు. టీఆర్ ఎస్ పార్టీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. టీఆర్ ఎస్ ను ఈ వ్యవహారం లో నిందించడం తగదు. అన్నాడీఎంకె కూడా ఆందోళన చేస్తోంది. ఆ పార్టీ ఎంపీ లతో టీడీపీ అవిశ్వాసం మీద మాట్లాడిందా? ప్రత్యేక హోదా సాధన ఏపీ పార్టీ లకు చేత కాక పోతే ప్రజలకు వదిలేయండి. లేదా తెలంగాణ ఉద్యమ నేపధ్యం చూసయినా ఏపీ పార్టీలు నేర్చుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాల ద్వారా ఒత్తిడి పెరిగింది. ఏపీలో ఉన్న మొత్తం 25 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఫలితం ఉంటుందేమో` అని తలసాని పేర్కొన్నారు.
ఏపీలో కొందరు ఏవో ఆపరేషన్లు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఆ ఆపరేషన్ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉండదన్నారు. టీడీపీ ఏపీలో సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని అన్నారు. ` నాలుగేళ్లు టీడీపీ బీజేపీ లు కాపురం చేసి విడిపోయాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగాక చంద్రబాబు అవిశ్వాసం పై అన్ని పార్టీ లతో మాట్లాడారని మీడియాలో వచ్చింది. చంద్రబాబు తానెవరితో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. దీంతోనే అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమం దశల వారీగా జరిగింది. చంద్రబాబు తెలంగాణ ఉద్యమాన్ని చూసి ఏమీ నేర్చుకోలేదు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచకుండా ఏం చేశారు? చంద్రబాబుకు అనుభవం ఉన్నా తొందరపడి ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ పార్టీలకు ఫైటింగ్ స్పిరిట్ లేదు` అని వ్యాఖ్యానించారు.
ఫెడరల్ ఫ్రంట్ కు కేసీఆర్ నాయకత్వం వహించాలని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తలసాని తెలిపారు. `నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కెసిఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీ లను ఒప్పించిన ఘనత కేసీఆర్ దే. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ ప్రజలు కోరుకుంటే టీఆర్ ఎస్ అందుకు సిద్ధంగా ఉంది. ఏపీ ప్రజలు - పార్టీ లు తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఏపీ ప్రజలను మూర్ఖులుగా మార్చే ప్రయత్నాన్ని అక్కడి పార్టీ లు మానుకోవాలి. ఏపీ స్పెషల్ స్టేటస్ పై వైఖరి స్పష్టం చేయాలని సీఎం కెసిఆర్ ప్రధాని మోడీ ని ప్రెస్ మీట్ ద్వారా ఇప్పటికే కోరారు.` అని తెలిపారు. ఏపీ ప్రజల ఆవేదనను చూసి చలించే ఈ అంశం పై నేను మాట్లాడాల్సి వస్తోందని తలసాని అన్నారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రధానితో కలవడాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారని అయితే కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ తో పాటు చంద్రబాబు మొన్నటి దాకా ఏపీ అసెంబ్లీ లో ఎందుకు కూర్చున్నారని తలసాని సూటిగా ప్రశ్నించారు.