అసెంబ్లీ సాక్షిగా త‌ల‌సాని చెప్పిన సీక్రెట్‌!

Update: 2019-02-25 11:35 GMT
కొన్ని విష‌యాల్ని కొంత‌మంది నేత‌లు చెప్పే వ‌ర‌కూ గుర్తించ‌ని ప‌రిస్థితి ఉంటుంది. మీడియా ఇంత భారీగా ఉన్న‌ప్ప‌టికి కొన్ని విష‌యాల్ని ట‌చ్ చేయ‌లేని ప‌రిస్థితి. అలాంటి విష‌యాన్నే తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అసెంబ్లీలో వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎంపికైన నేప‌థ్యంలో ఆయ‌న్ను అభినందిస్తూ త‌ల‌సాని మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా ప‌ద్మారావుతో త‌న‌కున్న సంబంధాన్ని చెప్పుకొచ్చిన ఆయ‌న‌.. ఎవ‌రికి తెలియ‌ని ఒక ర‌హ‌స్యాన్ని తాను చెబుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

ప‌ద్మారావుతో స‌భ‌లో ప‌లువురు స‌భ్యులు త‌మ‌కున్న అనుంబంధాన్ని చెప్పార‌ని..కానీ త‌మ‌కున్న అనుబంధం వేర‌న్నారు. హైద‌రాబాద్ జంట‌న‌గ‌రాల్లో త‌మ ఇళ్లు రోడ్డుకు అటువైపు.. ఇటు వైపు ఉండేవ‌ని.. రెండు కుటుంబాలు చాలా పెద్ద‌వ‌న్నారు. అనుకోకుండా ప‌ద్మారావు రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని.. త‌ర్వాత తాను కూడా రాజ‌కీయాల్లోకి రావ‌టం జ‌రిగింద‌న్నారు.

ఇక్క‌డున్న వారికి.. బ‌య‌ట ఉన్న వాళ్ల‌కు తెలీని ఒక ర‌హ‌స్యం త‌మ మ‌ధ్య ఉంద‌ని.. తాము వేర్వేరు పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ ఏ రోజూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శించుకున్న దాఖ‌లాల్లేవ‌న్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన తాము అంచెలంచెలుగా ఎదిగామ‌ని చెప్పారు. 1986లో ప‌ద్మారావు కార్పొరేట‌ర్ గా ఎన్నిక కావ‌టం.. ఆ డివిజ‌న్ త‌మ ఇద్ద‌రికి చెందిన‌దిగా చెప్పారు. 2001లో టీఆర్ ఎస్ పార్టీలో చేరిన ప‌ద్మారావు జంట‌న‌గ‌రాల అధ్య‌క్షుడిగా.. ఉద్య‌మ నాయ‌కుడిగా ప‌లు సంద‌ర్భాల్లో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌న్నారు.

అనుకోని రీతిలో 2004లో తాను.. ప‌ద్మారావు ఇద్ద‌రం ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ్డామ‌ని.. 2004 ఎన్నిక‌ల్లో ప‌ద్మారావు గెల‌వ‌గా.. తాను ఓడిపోయాన‌ని.. 2008లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తామిద్ద‌రం పోటీ ప‌డితే.. తాను గెలిచాన‌ని.. ప‌ద్మారావు ఓడార‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌మ మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవ‌న్నారు. త‌ల‌సాని మాట్లాడుతున్న వేళ స‌భ‌లోని స‌భ్యులంతా మంత్రివైపే చూస్తుండ‌టంతో ప‌ద్మారావు న‌వ్వు ఆపుకోలేక‌పోవ‌టం విశేషం.
Tags:    

Similar News