తాలిబ‌న్ల క‌బుర్లు.. భార‌త్ మిత్ర‌దేశ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌!

Update: 2021-08-28 11:30 GMT
వినేవాడుంటే.. చెప్పేవారు.. ఎన్న‌యినా చెబుతార‌ని అంటారు.. పెద్ద‌లు. ఇప్పుడు ఆఫ్ఘాన్‌ను ఆక్ర‌మించి.. ర‌క్త దాహం తీర్చుకునేందుకు రెడీ అయిన‌.. తాలిబ‌న్లు కూడా ఇప్పుడు ఇలానే చెబుతున్నారు. నిజానికి తాలిబాన్ల హ‌స్తంతో భార‌త్‌లో ఎన్ని అరాచ‌కాలు చోటు చేసుకున్నాయో.. చ‌రిత్ర స్ప‌ష్టం చేస్తున్న విష యం తెలిసిందే. కానీ, తాలిబ‌న్లు ఇప్పుడు టంగు మార్చారు. భార‌త్ త‌మ‌కు మిత్ర దేశ‌మ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఒప్పుకొంటే.. భార‌త్‌తో వ్యాపార వాణిజ్య వ్య‌వ‌హారాలు చేసేందుకుకూడా తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించ‌డం.. వారు చెబుతున్న క‌బుర్ల‌కు ప‌రాకాష్ట‌గా మారింది.

తాజాగా తాలిబాన్ల అధికార ప్ర‌తినిధి జైబుల్లా ముజాహిద్ మీడియాతో మాట్టాడుతూ.. భారత్ సహా ఇతర దేశాలతో తాలిబన్లలు సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. భార‌త్ త‌మ‌కు మిత్ర దేశ‌మ‌ని.. భారత్తో స్నేహపూరిత సంబంధాలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆఫ్గాన్ మట్టిని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. అంటే.. ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్లు.. దాడులు చేయ‌బోర‌ట‌. అంతేకాదు.. న‌మ్మితే ప్రాణాలు కూడా ఇస్తామ‌ని జైబుల్లా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

"ఆసియాలోని ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి. మేము ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాము. అలాగే మిగతా దేశాలతో కూడా తాలిబన్లు సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. ఆఫ్గాన్ ప్రజల ప్రయోజనాల మేరకు భారత్ తన విధానాన్ని రూపొందించాలని మేము కోరుతున్నాం`` అని బైబుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ.. చెప్పారు.  సమస్యల పరిష్కారానికి భారత్, పాకిస్థాన్లు కూర్చుని చర్చించుకోవాలని బైబుల్లా చెప్పారు. పొరుగు దేశాలుగా ఒకరి ప్రయోజనాలు మరొకరి మీదా ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. అంటే.. ప‌రోక్షంగా భార‌త్‌తో స్నేహం అంటూనే ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీచేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

స‌రే.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. మరోవైపు రాబోయే రోజుల్లో ఆఫ్గాన్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని ఐక్యరాజ్యసమితిలోని శరణార్థుల విభాగం తెలిపింది. కేవలం కొన్ని నెలల రోజుల్లోనే.. ఆఫ్గాన్ నుంచి 5 లక్షలకుపైగా ప్రజలు వలస వస్తారని అంచనా వేసింది. ఇప్పటికే వివిధ దేశాల్లో శరణార్థులుగా 2.2 మిలియన్ మంది ఆఫ్గాన్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది పాకిస్థాన్, ఇరాన్లో ఉంటున్నట్లు వివరించింది. అంటే.. స్థానికంగా ఉన్న ఆఫ్ఘాన్‌లే.. తాలిబాన్ల‌ను న‌మ్మ‌డం లేదు. కానీ, పొరుగున ఉన్న దేశాలు మాత్రం మిత్ర‌ప‌క్షాలుగా మారిపోవాల‌ని.. తాలిబ‌న్లు కోరుకుంటున్నారు. మ‌రి దీనివెనుక ఉన్న లాజిక్ ఏంట‌నేది ఇట్టే అర్ధ‌మ‌వుతుంది క‌దా!
Tags:    

Similar News