చీర‌లు కట్టుకొని నిర‌స‌న తెలిపిన రైతులు

Update: 2017-04-15 07:58 GMT
అన్న‌దాత క‌న్నీళ్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు క‌రువు అవ‌డంతో త‌మ ఆందోళ‌న‌ను తెలియ‌జెప్పేందుకు రైతులు నూత‌న మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. తమిళనాడులో నెలకొన్న కరువుకాటకాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ 32వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన మరో రూపం దాల్చింది. ప్రధాని మోడీని కలిసి తమ దీనావస్థను వివరించడానికి వారు చేయని ప్రయత్నం లేదు. రాజధానిలో వారు పలు రూపాల్లో ఆందోళనలు చేస్తున్న వారికి మోడీని కలిసే అవకాశం రాలేదు. రోడ్లపైనే భోజనాలు చేయటం, చావు మేళాలు చేపట్టడం, నోట్లో చచ్చిన ఎలుకలను పెట్టుకోవటం వంటి వాటితోపాటు... చివరకి వంటిపై నూలు పోగు కూడా లేకుండా రోడ్లపై నిరసన వ్యక్తంచేశారు. అయినా మోడీ వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో  మరో వినూత్న నిరసనకు దిగారు.

రైతులు తమ ముఖానికి పసుపు రాసుకుని, చీరలు కట్టుకుని అచ్చం ఆడవాళ్లలాగా నిరసన ప్రదర్శన చేపట్టారు. మోడీ కనుక మమ్మల్ని కలవాలనుకుంటే ముందుగా తమ దైన్య స్థితిని అర్థం చేసుకోవాలని, మా ఇంటి ఆడవాళ్లు పడుతున్న బాధలను గుర్తించాలని జ్యోతిరాం అనే రైతు వ్యాఖ్యానించారు. తన పదెకరాల్లో గింజ పండలేదని, చివరికి పెంచుకున్న గొర్రెలు కూడా ఆనారోగ్యానికి గురై చచ్చిపోయాయని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సందర్భంలోనే వారు వీధి నాటికను కూడా ప్రదర్శించారు. అందులో మోడీ పాత్రధారి కుర్చీలో ఠీవీగా కూర్చుని ఉంటారు. మిగిలిన వారంతా చీరలు కట్టి ఆయనకు వినతిపత్రాలు అందిస్తున్నట్టుగా వారు తమ నిరసనను తెలియచేశారు. పూర్తిగా రుణాల మాఫీని ప్రకటించాలని, కరువు నివారణకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని, తక్షణం కావేరీ వాటర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అవి సాధించే వరకు జంతర్‌ మంతర్‌ ను విడిచిపెట్టే ప్రసక్తిలేదని వారు స్పష్టం చేశారు.

కాగా, రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టదా? అంటూ తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. మార్చి 15వ తేదీ నుంచి తమిళ రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి తమిళ నటులు, రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News