అమ్మమృతిపై జ‌డ్జీ విచార‌ణ‌..ఆ వీడియోనే కీల‌కం

Update: 2017-09-25 13:19 GMT
త‌మిళ‌నాడు రాజకీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త సీఎం జయలలిత మ‌ర‌ణంపై విచార‌ణ మొద‌లుకానుంది. గతేడాది డిసెంబర్ 5న హార్ట్ ఎటాక్‌ తో జ‌య‌ల‌లిత‌ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై సీబీఐ విచారణ జరపాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న తనను కూడా జయను చూడటానికి అనుమతించలేదని ప‌న్నీర్‌ సెల్వం ఆరోపించారు. మ‌రోవైపు ఇటీవ‌ల ప్ర‌స్తుత సీఎం ప‌న్నీర్ సెల్వంతో క‌లిసేందుకు ఆయ‌న కుదుర్చుకున్న ఒప్పందంలో అమ్మ‌మ‌ర‌ణంపై విచార‌ణ ఒక‌టి.

గత నెల 17నే జయ మరణంపై న్యాయ విచారణ జరపనున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు జడ్జి పేరు మాత్రం ప్రకటించలేదు. జయలలిత మరణంపై విచారణ కోసం మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఏ ఆర్ముగస్వామిని తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సీఎం పళని - డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం వర్గాల విలీనానికి ఉన్న ప్రధాన డిమాండ్లలో జయ మరణంపై విచారణ అంశంలో కీల‌క ముంద‌డుగు ప‌డ‌టం ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంగా చెప్తున్నారు.

మ‌రోవైపు స్వర్గీయ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో తన మేనత్త శశికళ వద్ద ఉందని ఎఐఎడిఎంకె బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ చెప్పారు. ఆ వీడియోను జయలలిత మృతిపై దర్యాప్తు చేస్తున్న కమిటీకి అందజేస్తామని ఆయన అన్నారు. ఈ వీడియో అమ్మ మ‌ర‌ణంపై విచార‌ణ‌లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని భావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌ సెల్వం (ఒపిఎస్‌), మరొక 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసనసభలో డిఎంకె విప్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత ఫిబ్రవరి 18న శాసనసభలో పన్నీర్‌ సెల్వం - 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ ను ధిక్కరించి ముఖ్యమంత్రి పళనిస్వామికి అనుకూలంగా ఓటు వేయలేదని ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌ను వ్యతిరేకిస్తే తమిళనాడు లెజిస్లేటివ్‌ (డిస్‌ క్వాలిఫికేషన్‌ ఆన్‌ గ్రౌండ్‌ ఆఫ్‌ డిఫెక్షన్‌) రూల్స్‌ 1986 ప్రకారం వారు అనర్హులవుతారని డిఎంకె పేర్కొంది.
Tags:    

Similar News