తమిళులు ఏ విధేయుడి పక్షం?

Update: 2017-02-16 07:12 GMT
తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలక అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం పుణ్యమా అని పది రోజుల వ్యవధిలో పరిణామాలు వేగంగా మారిపోవటమే కాదు.. ఊహించని పరిణామాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నమ్మ.. తన ఆశను అక్కడితో ఆపుకున్నా.. ఇవాల్టి పరిస్థితులు చాలావరకూ చోటు చేసుకునేవి కావేమో.

ఆమె ఎప్పుడైతే.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావాలంటూ పావులు కదపటం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి ఒకటి తర్వాత ఒకటిగా పరిణామాలు వేగంగా చోటు చేసుకోవటమే కాదు.. అమ్మ.. చిన్నమ్మ అండ్ కో అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలిపోవటం.. అమ్మకు.. చిన్నమ్మకు విధేయుడిగా పేరున్న పన్నీర్.. చిన్నమ్మ ఎప్పటికి క్షమించలేని ప్రత్యర్థిగా మారిపోవటం.. చివరకు ఆమె జైలుకు వెళ్లటమే కాదు.. అమ్మ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో ముఖ్యమంత్రి కుర్చీ కోసం అమ్మ విధేయుడు.. చిన్నమ్మ విధేయుడు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అంకెల పరంగా చూస్తే.. చిన్నమ్మ విదేయుడు ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారితే.. అపద్ధర్మ ముఖ్యమంత్రి.. అమ్మ విధేయుడు ఓ పన్నీర్ సెల్వం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

పన్నీర్ వర్సెస్ శశికళ అన్నప్పుడు.. తమిళ ప్రజానీకం పన్నీర్ వెంట ఉండటం తెలిసిందే. తాజాగా మారిన కాంబినేషన్లో మరోసారి ప్రజాభిప్రాయాన్ని ఎవరికి వారు చేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మీ ఓటు ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి)కా? ఓపీఎస్ (ఓ.పన్నీర్ సెల్వం)కా? అంటూ ప్రశ్నిస్తున్న వైనం జోరుగా సాగుతోంది. వాట్సప్.. ఫేస్ బుక్.. ట్విట్టర్ లో ఈ పోస్టింగ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి విధేయుల్లో తమిళ ప్రజలు ఎవరివైపు అన్న విషయంపై స్పష్టత రాలేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News