ఇక గ్రామాల‌కు అమ్మ పేరు

Update: 2017-07-15 04:56 GMT
తమిళనాడు రాష్ట్ర మాజీ సీఎం - దివంగత జయలలితను స్మ‌రించుకునేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మానికే శ్రీ‌కారం చుట్టింది. ఏకంగా ఒక్కో ఊరికి అమ్మ పేరును పెట్ట‌నున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అన్నాడీఎంకే అధికారం చేపట్టిన అనంతరం అనేక సంక్షేమ పథకాలకు దివంగత జయలలిత పేర్లను పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాట జయలలితను ‘అమ్మ’గా పిలుస్తారు. దీంతో అనేక ప్రభుత్వ పథకాలకు అమ్మ పేరు పెట్టారు. అమ్మ క్యాంటిన్‌ - అమ్మ ఉప్పు - అమ్మ ల్యాప్‌ టాప్‌ - అమ్మ మిక్సీ - అమ్మ కల్యాణమండపాలు ఇలా అనేక పథకాలు వచ్చాయి. ఇదేరీతిలో తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న ఈ-గ్రామాలకు దివంగత జయలలిత పేరు పెట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.

నూత‌న ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి.. దాన్ని స్మార్ట్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి తెలిపారు. వీటికి ‘అమ్మ ఈ- గ్రామాలు’ అని పేరు పెట్టనున్నట్లు సీఎం చెప్పారు. ఈ గ్రామాలకు వైఫై, స్మార్ట్‌ వీధి దీపాలతో పాటు.. టెలీ ఎడ్యుకేషన్‌, టెలీ మెడిసిన్‌ సర్వీసెస్‌ అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న ఈ-గ్రామాలు అభివృద్ధికి మారుపేరుగా ఉంటాయ‌ని, అమ్మ పేరు పెట్ట‌డ‌మే కాకుండా ఆమె ఆకాంక్షకు త‌గిన రీతిలో ఉంటాయ‌ని తెలిపారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ-పాలన కోసం కూడా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని చెప్పారు. రూ.477.96 కోట్లతో మూడోదశ తమిళనాడు రాష్ట్ర వైడ్‌ ఏరియా నెట్‌ వర్క్‌ ను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్య‌మంత్రి పళ‌నిస్వామి ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News