తమ్మినేని వారసుడు టార్గెట్ అదే... ?

Update: 2021-12-05 11:30 GMT
వారసత్వం రాజకీయాల్లో అతి ముఖ్యమైన అర్హతగా మారిపోయింది. తండ్రి తరువాత తనయుడు కచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ  కావాల్సిందే. లేకపోతే ముందు అభిమానులే ఊరుకోరు. దానికి తోడు నేతాశ్రీలు కూడా తమ వారసులను ఎంకరేజ్ చేయడం మొదలెట్టేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అంతటా ఇదే అమలవుతోంది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే స్పీకర్ తమ్మినేని సీతారామ్ సీనియర్ మోస్ట్ నేత. 1983లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి నాటి కాంగ్రెస్ ఉద్ధండులను ఓడించారు.

ఆ తరువాత నాలుగు సార్లు అదే సీట్లో నుంచి ఎమ్మెల్యే అయ్యారు,  టీడీపీలో మంత్రిగా పనిచేశారు. అయితే 2004 తరువాత నుంచి మాత్రం ఆయన వరసబెట్టి  ఓడిపోతూనే వచ్చారు. మధ్యలో ప్రజారాజ్యంలోకి వెళ్లారు, తిరిగి టీడీపీలో చేరారు. 2014లో వైసీపీ ద్వారా పోటీకి దిగినా కూడా విజయం మాత్రం ఆయనను వరించలేదు. ఎట్టకేలకు జగన్ వేవ్ లో 2019 ఎన్నికల్లో తమ్మినేని గెలిచి రాజాంగబద్ధమైన స్పీకర్ పదవిలో కుదురుకున్నారు.

అయితే ఈసారి తమ్మినేని గెలవడం వెనక ఆయన తనయుడు చిరంజీవి నాగ్ పాత్ర పూర్తిగా ంది. తండ్రిని మళ్లీ గెలిపించాలి. అధికార దర్జా చూడాలన్న కసితో కొడుకు మొత్తం ఎన్నికల  ప్రచారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకున్నారు. అన్ని వర్గాలను కలసి మద్దతు కూడగట్టారు. మరో వైపు  బావ వరస అయిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్  ఎత్తులకు పై ఎత్తు వేశారు. దాంతో తమ్మినేని బిగ్ సక్సెస్ వెనక కొడుకు ఉన్నారని అందరికీ తెలిసింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయానికి చిరంజీవి నాగ్ చేసిన విశేష కృషి ఉంది.

ఈ నేపధ్యంలో ఆయనకు వైసీపీలో యూత్ పదవి దక్కింది. ఆయన పార్టీ హోదాలో అటు ఆముదాల వలసలోనే కాకుండా ఇటు జిల్లావ్యాప్తంగా కూడా తిరుగుతూ తన పట్టుని పెంచుకుంటున్నారు. ఆ మధ్య జగన్ని తండ్రి వెంట వెళ్లి మరీ కలసి వచ్చారు. జగన్ కూడా పార్టీని జిల్లాలో పటిష్టం చేయమని సూచించారు. దాంతో చిరంజీవి నాగ్ ఇంకా దూకుడు మీద రాజకీయం చేస్తున్నారు.

ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటుకు కైవశం చేసుకోవడం. ఇప్పటికి రెండు పర్యాయాలు ఈ సీటుకి పోటీ పడినా వైసీపీని గెలుపు వరించలేదు. మొదటి సారి వైసీపీ తరఫున మహిళా నేత  రెడ్డి శాంతి పోటీ చేశారు. ఆమె తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు. అయినా ఎర్రన్నాయుడు వారసుడి గెలుపు ఆపలేకపోయారు. 2019 ఎన్నికల వేళ దువ్వాడ శ్రీనివాస్ ని బరిలో ఉంచారు. రామ్మోహననాయుడు మెజారిటీ అయితే తగ్గింది కానీ విజయం మాత్రం దక్కలేదు. దీంతో ఈసారి తమ్మినేని వారసుడి తాను గెలిచి చూపిస్తాను అంటున్నారు.

శ్రీకాకుళం పార్లమెంట్ సీటు పరిధిలో కాళింగ సామాజికవర్గం ఎక్కువ. గతంలో కిల్లి కృపారాణి, బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు వంటి వారు ఆ సామాజికవర్గం నుంచి  ఎంపీలుగా గెలిచారు.  బొడ్డేపల్లి అయితే ఏకంగా ఆరుసార్లు ఎంపీ అయ్యారు. ఒక విధంగా కాళింగులకు ఈ సీటు పెట్టని కోట అంటారు. అలాంటి సీట్లో ఆయన్ని ఎర్రన్నాయుడు ఓడించేశారు. దాంతో వెలమల పట్టు నిరూపించుకున్నట్లు అయింది.

ఇదిలా ఉంటే రాజకీయంగా జిల్లాలో కాళింగులకు అనేక  అవకాశాలు ఇస్తూ వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. బలమైన వెలమ సామాజికవర్గాన్ని ఢీ కొట్టాలీ అంటే కాళింగులకే ఎంపీ సీటు కేటాయించాలి అన్నది వైసీపీ పెద్దల ఆలోచన. దాంతోనే  తమ్మినేని వారసుడు ఈ సీటు మీదనే కన్నేశారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఖాయమని అంటున్నారు. మరి తమ్మినేనికి ఎమ్మెల్యే, కొడుకుకు ఎంపీ టికెట్లు ఇస్తారా లేక తమ్మినేనిని పక్కన పెట్టి వారసుడిని ప్రోత్సహిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా తమ్మినేని వారసుడు ఎర్రన్నాయుడు వారసుణ్ణి  గట్టిగానే సవాల్  చేస్తున్నారు మరి.
Tags:    

Similar News