కేశినేని సీటుకు ఎర్త్ పెట్టే ప్లాన్ టీడీపీలో మొద‌లైందా ?

Update: 2021-09-17 03:30 GMT
విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సీటుకు టీడీపీలో ఎర్త్ పెట్ట‌నున్నారా ?  పార్టీలో కొంద‌రు కీల‌క నేత‌ల‌తో పాటు పార్టీ అధిష్టానం సైతం నాని విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉందా ? ఇదే ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానిని ప‌క్క‌న పెట్టేందుకు కార‌ణం కానుందా ? అంటే పార్టీ వ‌ర్గాల్లో అవున‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ట్రావెల్స్ రంగంలో కీల‌కంగా ఉన్న నాని ప్రజారాజ్యంలో త‌న అదృష్టం ప‌రీక్షించుకోవాల‌నుకున్నారు. అయితే 2009 ఎన్నిక‌ల‌కు ముందు నాని ఆ పార్టీ నేత‌ల‌తో విబేధించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌ర్వాత టీడీపీలో చేరిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇవ్వ‌గా విజ‌యం సాధించారు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ సునామి ముందు మ‌హామ‌హ‌లే కొట్టుకుపోయారు. అయితే నాని మాత్రం విజ‌య‌వాడ ఎంపీగా రెండోసారి సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌ప్పుడు.. పార్టీ అధికారంలో ఉండ‌డంతో చేసిన అభివృద్ధి ప‌నులే ఆయ‌న రెండోసారి గెలుపున‌కు కార‌ణం అయ్యాయి. అయితే రెండోసారి గెలిచాక ఆయ‌న స్వ‌రంలో మార్పు వ‌చ్చింది. సొంత పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు లోకేష్‌, అధిష్టానాన్ని సైతం ఆయ‌న టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ వ‌చ్చారు.

బుద్ధా వెంక‌న్న లాంటి నేత‌ల‌ను దారుణంగా ఆడుకున్నారు. చివ‌ర‌కు ఇది బెజ‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై తీవ్రంగా ప‌డింది. నాని తీరుకు వ్య‌తిరేకంగా నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే బొండా వెంక‌న్న‌తో పాటు బుద్ధా వెంక‌న్న సైతం ప్రెస్‌మీట్ పెట్టి ఆయ‌న‌కు స‌హ‌క‌రించేది లేద‌ని చెప్పారు. చివ‌ర‌కు ఆయ‌న కుమార్తె కేశినేని శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌ల‌వంతంగా ప్ర‌క‌టింప‌జేసుకున్నా కూడా సొంత పార్టీ నేత‌ల స‌హ‌కారం లేక‌పోవ‌డంతో సులువుగా గెల‌వాల్సిన బెజ‌వాడ కార్పొరేష‌న్ సీటును టీడీపీ కోల్పోయింది. ఇక లోకేష్‌ను సైతం నాని కొద్ది రోజుల వ‌ర‌కు గ‌ట్టిగానే టార్గెట్ చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెజ‌వాడ ఎంపీ టిక్కెట్ రేసులో తానుకూడా ఉంటాన‌ని బుద్ధా వెంక‌న్న ఓపెన్‌గానే చెప్పారు. ఓ సిట్టింగ్ ఎంపీ ఉండ‌గానే బుద్ధా అలా ప్ర‌క‌టించ‌డం వెన‌క పార్టీలోనే కొంద‌రు నేత‌లు ఆయ‌న వెన‌క ఉన్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. మ‌రోవైపు బెజ‌వాడ ఎంపీ సీటును క‌మ్మ వ‌ర్గానికే ఇవ్వాల్సి ఉంది. ఈ క్ర‌మంలో బుద్ధాతో నామ్‌కే వాస్తేగా అలా మాట్లాడించి ఎన్నిక‌ల వేళ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయిస్తార‌ని పార్టీలోనే మ‌రికొంద‌రు నేత‌లు అంటున్నారు. ఏదేమైనా నాని అంటే ప‌డ‌ని వారు ఆయ‌న సీటుకు ఎర్త్ పెట్టేందుకు తెర‌వెన‌క చాలా ప్లాన్లే వేస్తున్నారు.

జ‌య‌దేవ్ పార్ల‌మెంటులో పార్టీ కోసం బాగా వాయిస్ వినిపిస్తారు. ఆయ‌న కూడా గుంటూరు నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎంపీ అయ్యారు. అయితే అక్క‌డ ఆయ‌న‌కు స్థానిక నేత‌ల‌తో చిన్న గ్యాప్ ఉంది. ఈ సారి జ‌య‌దేవ్‌ను విజ‌య‌వాడ నుంచి ఎంపీ బ‌రిలోకి దింపి.. నానిని ప‌క్క‌న పెట్టేలా బాబు సైతం ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇస్తే గిస్తే కేశినేనికి ఏదో ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డం లేదా ఆయ‌న‌కు ఏదో నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చి స‌రిపెట్టేయ‌డం చేస్తార‌ని అంటున్నారు. మ‌రి రెండుసార్లు గెలిచిన నానిని ప‌క్క‌న పెట్టే ధైర్యం బాబు ఎన్నిక‌ల వేళ చేస్తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News