హౌస్ కమిటి విచారణ ముందుకు టీడీపీ ?

Update: 2022-07-05 23:30 GMT
డేటా చోరీ వ్యవహారంలో తొందరలోనే తెలుగుదేశంపార్టీకి చెందిన కొందరు కీలక నేతలను హౌస్ కమిటి విచారించబోతున్నట్లు సమాచారం. డేటా చోరీకి సంబంధించి అసెంబ్లీ కొందరు ఎంఎల్ఏలతో హౌస్ కమిటిని వేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఈ కమిటికి ఛైర్మన్ గా ఉన్నారు.

డేటాచోరీ విచారణ నిమిత్తం ఇప్పటికే కమిటి మూడు సార్లు భేటీ అయ్యింది. ఈ కమిటీకి పోలీసు, ఐటి నిపుణులు కూడా సహకారం అందిస్తున్నారు.

ఈరోజు భూమన మాట్లాడుతు 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వచ్చేలా వ్యవహిరంచినట్లు చెప్పారు. అంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వమని చెప్పకనే చెప్పినట్లయ్యింది.  ఓటర్లజాబితాలో తమకు అనుకూలమైన ఓట్లను ఉంచి ప్రతికూలమని అనుకున్న వారి ఓట్లను తొలగించిందనే ఆరోపణలను భూమన గుర్తుచేశారు.

ప్రస్తుతం తమ కమిటి చేస్తున్న విచారణలో అనేక కీలకమైన విషయాలు వెలుగు చూసినట్లు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా డేటాను దొంగలించి రాజకీయంగా లబ్దిపొందే ప్రయత్నాలు చేసిన విషయంపై స్పష్టత వచ్చిందన్నారు.

ఏపీ, తెలంగాణాలో డేటా చోరీ జరిగిందని అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపించిన విషయాన్ని భూమన గుర్తుచేశారు. తన దగ్గర గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అందించినట్లు మండిపడ్డారు.

ఈ నేపధ్యంలోనే హౌస్ కమిటి ముందుకు కొందరు కీలక వ్యక్తులను విచారణ నిమిత్తం పిలిపించాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. ఆ విచారణ పూర్తవ్వగానే నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. కేవలం ఆరోపణల ఆధారంగా మాత్రమే హౌస్ కమిటి నివేదిక అందిస్తుందా లేకపోతే విచారణలో  సేకరించిన పక్కా ఆధారాలతో నివేదిక రెడీ చేస్తుందా అన్నది కీలకమైంది. ఫోన్ ట్యాపింగ్, డేటాచోరీ, ప్రైవేటు వ్యక్తుల చేతికి వ్యక్తిగత వివరాలు వెళ్ళటమనేది చాలా పెద్ద నేరంగానే పరిగణించాలి. చివరకు ఏమవుతుందో ఏమో.
Tags:    

Similar News