టీడీపీ, బీజేపీ వ్యూహం అదుర్స్

Update: 2016-01-14 06:30 GMT
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ వ్యూహాలు బాగున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి దీటుగా వ్యూహాలు రచిస్తున్నారని, ప్రచారంలోనూ సమర్థంగా దూసుకెళుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ నిధులను తెలంగాణకు, ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించేస్తారని, హైదరాబాద్ ప్రజలు మాత్రం గతుకుల రోడ్లతో మంచినీటి కరువుతో కటకటలాడాల్సిందేనని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. నిజానికి ఒక్క హైదరాబాద్లోనే రూ.60 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మిగిలిన తెలంగాణ అంతా కలిపినా దాదాపు పాతిక వేల కోట్ల ఆదాయం కూడా లేదు. దాంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే తెలంగాణ నిధులు ప్రభుత్వానికి ఏమాత్రం చాలవు. హైదరాబాద్ నిధులను వాడాల్సిందే. ఇప్పుడు ప్రత్యేకాధికారుల పాలన ఉంది కాబట్టి గ్రేటర్ నిధులను కొన్నిటిని ప్రభుత్వంలోకి మళ్లిస్తున్నారు. రేపు భవిష్యత్తులో గ్రేటర్ లో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గ్రేటర్ నిధులను పూర్తి స్థాయిలో మళ్లించేస్తారని టీడీపీ ప్రచారం చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడం, ఇప్పటికే నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ ప్రచారానికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది.

ఇక, బీజేపీ కూడా టీఆర్ఎస్ వాదననే అందిపుచ్చుకుంటోంది. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్లేనని ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనని, టీడీపీకి వేస్తే కాంగ్రెస్కు వెసినట్లేనని రకరకాలుగా టీఆర్ఎస్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోంది. మజ్లిస్ పై ఇప్పటికే హైదరాబాద్ వాసుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ముస్లిములు మినహా హిందూ వాదులు ఎవరూ ఓటు వేయని పరిస్థితి ఉంది. దీనికితోడు తమకు పూర్తి అధికారం రాకపోతే మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటామని టీఆర్ఎస్ ప్రకటించింది. దాంతో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మజ్లిస్ కు  వేసినట్లేనన్న బీజేపీ ప్రచారానికి కూడా ఆదరణ వస్తోంది.

Tags:    

Similar News