కరోనాపై మోడీ, జగన్ చెప్పింది ఒకటేగా

Update: 2020-04-28 15:30 GMT
కరోనా మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, దాన్ని కట్టడి చేయకపోయినా, దాంతో మనం కలసి జీవించాల్సి వచ్చినా నష్టం లేదని అన్నారు జగన్. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి ఇళ్లలో నుంచే చికిత్స చేసి నయం చేయవచ్చని...కంగారు లేదని చెప్పారు జగన్. స్వైన్ ఫ్లూ, చికెన్ పాక్స్ మాదిరిగానే కరోనాకు వచ్చి వెళ్లిపోతుందని అన్నారు. ఇంకేముంది, జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు, వాటి అనుకూల మీడియాకు ఆయుధంగా మారాయి. కరోనాను కట్టడి చేయలేక సీఎం జగన్ చేతులెత్తేశారని...జగన్ అసమర్థ సీఎం అంటూ విపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక, జగన్ పై ఎల్లో మీడియా ఎప్పటిలాగే తన విష ప్రచారం కొనసాగిస్తోంది. అయితే, సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.

కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉన్నందున మాస్కులు, శానిటైజర్లు మన జీవితంలో భాగం కాబోతున్నాయని మోడీ మాట్లాడారు. రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ కరోనాతో కొంతకాలం ఆంక్షలను భరించాల్సిందేనని చెప్పారు. దాదాపుగా మోడీ చెప్పిన వాటినే జగన్ చెప్పారు...కాకపోతే, మోడీ కొద్దిగా ఇన్ డైరెక్ట్ గా సాఫ్ట్ మ్యానర్ లో చెబితే...జగన్ ముక్కుసూటిగా సుత్తి లేకుండా...డైరెక్ట్ గా...చెప్పారు. దీంతో, జగన్ పై కొందరు పనిగట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఇపుడున్న ప్యానిక్ టైంలో జగన్ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ, జగన్ చెప్పిన విషయాలపై లోతుగా ఆలోచిస్తే సీఎం జగన్ చెప్పినవన్నీ అక్షర సత్యాలు...చేదు నిజాలేనని అర్థమవుతుంది. కరోనా పుట్టుక..వ్యాప్తి...వంటి విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కరోనాకు వ్యాక్సిన్ రావడానికి మరి కొన్ని నెలలు పట్టవచ్చు. ఇప్పటికే చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ ఫలితాలు పూర్తిగా రాలేదు.

ఇకపోతే, ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా కరోనా సోకుతుండడంతో వ్యాధిగ్రస్తులను ట్రేస్ చేయడం వంటి ప్రక్రియ కొనసాగుతోంది. అందుకు గానూ దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తూ...జగన్ ముందు వరసలో ఉన్నారు. లక్షణాలు లేని వారికి కూడా ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు. ఇలా కరోనాను కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. గతంలో ప్యారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, చాలా దేశాల శాస్త్రవేత్తలు జగన్ చెప్పిన విషయాన్ని నిర్ధారించడంతో ఆ నోళ్లు మూతబడ్డాయి. యదార్థ వాది లోక విరోధి అన్నారు....అది జగన్ కు వర్తిస్తుంది. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం ...ముక్కుసూటిగా వెళ్లడం జగన్ బలం...బలహీనత కూడా. అయితే, జనాలను మభ్య పెట్టకపోవడం...మాయ చేయకపోవడం...జగన్ కు ఎప్పటికీ బలమే. ఈ రోజు కాకపోతే...రేపు ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. 2014లో రైతు రుణమాఫీ చేయలేనంటూ జగన్ నిర్మొహమాటంగా చెప్పడంతో..2 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ, 2019లో అబద్దపు హామీలివ్వలేదు...ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని వాటినీ నెరవేరుస్తున్నారు.

2019 ఎన్నికల వేళ కాపు రిజర్వేషన్లు కుదరదన్న జగన్ పై ఎంత వ్యతిరేకత వచ్చినా...ప్రజలు జగన్ కే పట్టం కట్టారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల పోస్టుల భర్తీపై ప్రతిపక్షాలు ఎంత గొడవ చేశాయో చూశాం. కానీ, నేడు దేశానికే తలమానికంగా వలంటీర్లు మూడు సార్లు సర్వే చేసి...విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంతో పాటు...కరోనా అనుమానితులను గుర్తించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఏది ఏమైనా...జగన్ ఆ వ్యాఖ్యలను ఇంకాస్త పాలిష్డ్ గా చెప్పి ఉంటే...విమర్శలకు తావుండేది కాదు. కానీ, ముక్కు ఎక్కడ అంటే తిప్పి చూపడం కన్నా...ఎదురుగా ఉండి చూపించడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఎందుకంటే..కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో జగన్ బిజీగా...ఉన్నారు....పదే పదే ప్రెస్ మీట్లతో హడావిడి చేసి....మీడియాను మేనేజ్ చేయడం వల్ల పబ్లిసిటీ వస్తుంది కానీ....ఫలితాలు కావు. కాబట్టి...జగన్ వ్యాఖ్యలలోని మర్మం...అర్థం చేసుకున్నోళ్లకి అర్థం చేసుకున్నంత...అపార్థం చేసుకునే వాళ్లకి ఎంత చెప్పినా వ్యర్థం.
Tags:    

Similar News