లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ : ఎమ్మెల్యే ర‌వీంద్రనాథ్ రెడ్డి పై టీడీపీ సెటైర్లు

Update: 2022-08-24 09:30 GMT
నిన్నటి ఈనాడు వార్త ఒకటి ఏపీలో కలకలం సృష్టించింది. దీంతో అనేకమంది మీడియా ముందుకు వచ్చారు. క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర నాథ్ రెడ్డి నిన్న‌టి వేళ స్పందించారు. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ భూములు కేవ‌లం వేలం ద్వారానే తాము కొనుగోలు చేశామ‌న్నారు. అయితే ఇందులో రాజ‌కీయ ఉద్దేశాలు ఏవీ త‌మ‌కు లేవ‌ని తేల్చేశారు. అంతేకాదు జ‌గ‌న్ వ్యాపారాల‌కూ, త‌మ‌కూ ఏం సంబంధం లేద‌ని, ఆయ‌న చెప్పి తాము వ్యాపారాలు చేయం అని చెప్పారు.

చంద్ర‌బాబు అయినా, రాజ‌శేఖ‌ర్ రెడ్డి అయినా స‌దుద్దేశంతోనే భూములు ఇచ్చారని అన్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తుంది. లేపాక్షి భూములు స‌దుద్దేశంతోనే ఇస్తే సంబంధిత వ్య‌క్తులు వ‌చ్చి జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లో పెట్టుబ‌డులు ఎందుకు పెట్టార‌ని..? ఈ ప్రశ్న‌కు కూడా స‌మాధానం చెప్పాలి అని విప‌క్షం ప్రశ్నిస్తోంది.

మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి టీడీపీ నిన్న కీల‌క వ్యాఖ్యలు చేసింది. ప్ర‌జ‌ల వైపు ఉంటారో బంధువుల వైపు ఉంటారో అన్న‌ది కూడా జ‌గ‌న్ తేల్చుకోవాల‌ని టీడీపీ నిలదీస్తోంది. ప‌ది వేల కోట్ల విలువ‌యిన భూములు ఐదు వంద‌ల కోట్ల‌కే ప‌క్క‌దోవ‌లో ప్ర‌యివేటు వ్య‌క్తులు హాయిగా కొట్టేస్తున్నార‌ని టీడీపీ మండిపడుతోంది.

ఇదంతా ఇప్పుడు కొత్త వివాదానికి తావిస్తోంది. ఇందూ ప్రాజెక్ట్ భూముల‌ను ఎర్తిన్ ప్రాజెక్టు కంపెనీ ప్ర‌తినిధులు కొన్నార‌ని, ఇందులో భాగంగానే తాము పెట్టుబ‌డులు పెట్టామ‌ని ఎమ్మెల్యే ర‌వీంద్ర చెబుతున్నారు. త‌మ కుమారుడు కేవ‌లం పెట్టుబ‌డుల కోసమే ఆ కంపెనీలో డైరెక్ట‌ర్ గా చేరార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఎర్తిన్ ప్రాజెక్టు త‌ర‌ఫు మ‌నుషులు మాత్రం త‌మ కంపెనీ డైరెక్ట‌ర్ల‌లో కొత్త‌గా చేరిన వారికి రాజ‌కీయ నేప‌థ్యం ఉంద‌న్న సంగతే త‌మకు తెలియ‌ద‌ని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవ‌రి మాట న‌మ్మాలి. ? ఇదీ విప‌క్షం ప్ర‌శ్న.

భూముల వివాదం అయితే 12 ఏళ్లుగా న‌లుగుతోంది. పీఏసీ చైర్మ‌న్ హోదాలో తాను కూడా వీటిపై ప్ర‌శ్నిస్తూ ప్ర‌భుత్వానికి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో లేఖ రాశాన‌ని ప‌య్యావుల కేశ‌వ్ అంటున్నారు. అయినా  కూడా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పంద‌న లేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారు.

టీడీపీ వాద‌న ఎలా ఉన్నా భూముల విష‌యమై ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణయం అన్నదే కీల‌కం కానుంది. భూముల వివాదంపై జ‌గ‌న్ స్పందిస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వ‌స్తాయి. ఓ కంపెనీ దివాలాలో ఉంద‌ని, ఆ సాకుతో ఆ కంపెనీ భూముల‌ను అతి త‌క్కువ ధ‌ర‌కే ద‌క్కించుకునేందుకు ప‌న్నాగాలు ప‌న్న‌డం స‌బ‌బు కాద‌ని, కంపెనీ లా ను అడ్డం పెట్టుకుని భూములు గుంజుకోవ‌డం చ‌ట్ట వ్య‌తిరేకం అని నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News