వైసీపీ ప్లాన్‌ కాపీ కొట్టిన టీడీపీ..!

Update: 2019-03-01 05:18 GMT
వైసీపీ ప్లాన్‌ వేసింది.. టీడీపీ అమలు చేసింది..  ప్లాన్‌ ఒకరిది.. ఆచరణ మరొకరిది. నేతలను మార్చి పోటీ చేయిద్దామనుకున్న ఫ్యాన్‌ పార్టీని చూసి టీడీపీ తమ అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చే పనిలో పడింది. ఒంగోలు టు నెల్లూరు.. నెల్లూరు టు ఒంగోలు వైసీపీ అమలు చేద్దామనుకున్న ఈ స్కెచ్‌ కు టీడీపీ పదును పెడుతోందట. నెల్లూరు ఎంపీ మేకపాటిని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని జగన్‌ వ్యూహమట. అలాగే ఒంగోలు టీడీపీ నేత మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి పార్టీలోకి చేర్చుకొని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని జగన్‌ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం..

అయితే మాగుంట శ్రీనవాసరెడ్డిపై వైవీరెడ్డి వ్యంగాస్త్రాలు విసరడం.. పార్టీ మారే విషయంలో మాగుంట సస్పెన్స్‌ ను కొనసాగించడంతో అభ్యర్థులను మార్చాలన్న జగన్‌ వ్యూహం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేయడానికి సై అంటోందట. నెల్లూరు అభ్యర్థిని ఒంగోలుకు.. ఒంగోలు అభ్యర్థిని నెల్లూరుకు పంపి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించాలని బాబు ప్లాన్‌ వేస్తున్నాడట. వైసీపీ ప్లాన్ ను మక్కికి మక్కీ కాపీ కొట్టాలని భావిస్తున్నాడట.. నెల్లూరు ఎంపీగా పోటీకి సై అన్న బీద మస్తాన్‌ రావుకు, ఒంగోలు ఎంపీగా శ్రీనివాసరెడ్డికి పోటీ విషయం చంద్రబాబు స్పష్ట ఇచ్చారట.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పాతికేళ్లుగా మాగుంట ఫ్యామిలీ చక్రం తిప్పుతోంది. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మాగుంట ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో సీన్‌ మారింది. టీడీపీ నుంచి బరిలోకి దిగితే మళ్లీ ఓటమి తప్పదని మాగుంట భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి పోటీ తప్పదనుకుంటే ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు  నియోజకవర్గ ఇన్‌ చార్జి  టిక్కెట్లు ఇవ్వద్దని కండిషన్‌ పెడుతున్నాడట. అందుకు పార్టీ అధిష్టానం ఒప్పుకోవడం లేదట. మరోవైపు మాగుంట సొంత జిల్లా నెల్లూరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో అనుచరులు ఆలోచిస్తున్నారట.

అటు టీడీపీ అధిష్టానం కూడా ఒంగోలు నుంచి పోటీకి మాగుంట వెనుకాడుతున్నందున ఆయనను నెల్లూరు నుంచి పోటీ చేయించేందుకు ప్లాన్‌ వేస్తుందట. మొన్నటి వరకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బీద మస్తాన్‌ రావు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు మాగుంటను నెల్లూరు తీసుకొస్తే బీద మస్తాన్‌ రావుకు ఒంగోలు కేటాయించాలని చూస్తున్నారు. ఆర్థికంగా బలోపేతమైన బీద మస్తాన్‌ రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రకాశం జిల్లాలో యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో మస్తాన్‌ రావును ఒంగోలు నుంచి దింపితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీడీపీ ఆలోచిస్తోంది.

అయితే టీడీపీ నుంచి బీద మస్తాన్‌ రావు ఒంగోలు నుంచి, మాగుంట నెల్లూరు నుంచి పోటీ చేయడానికి అంగీకరిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా మాగుంట ఒకవేళ వైసీపీలోకి వెళితే నెల్లూరు వెళ్లాల్సిన పని లేదని, ఒంగోలులోనే గెలుపు ఖాయని అనుచరులు అంటున్నారు. అయితే ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన వైవి సుబ్బారెడ్డి మాగుంటకు చెక్‌ పెట్టే పనిలో ఉన్నాట. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చని ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News