తీవ్ర అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్లో టీడీపీ మాజీ మంత్రి..!

Update: 2021-03-15 16:30 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలీలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్లి పరామ‌ర్శించ‌డంతో పాటు ఆయ‌న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వ‌చ్చారు. ఇక ప్ర‌స్తుతం హాస్ప‌ట‌ల్లో ఉన్న బొజ్జ‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు పరామ‌ర్శించ‌డంతో పాటు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటార‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రు అయిన బొజ్జ‌ల ఆ జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండున్న‌ర ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తున్నారు. 2003లో అలిపిరిలో న‌క్స‌లైట్లు చంద్ర‌బాబుపై దాడిచేసిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు బొజ్జ‌ల కూడా తృటిలో త‌ప్పించుకున్నారు. మావోయిస్టులు బాబును ల‌క్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో బొజ్జ‌ల‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. బొజ్జ‌ల 1989, 1994, 1999, 2009, 2014లో మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు రెండు సార్లు మంత్రిగా కూడా ప‌నిచేశారు.

తొలి ఏపీ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ మంత్రిగా పనిచేశారు. అయితే మూడేళ్ల త‌ర్వాత బాబు ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించడంతో బొజ్జ‌ల అల‌క బూనారు. ఇక బొజ్జ‌ల త‌న తండ్రి అయిన సుబ్బ‌రామిరెడ్డి రాజ‌కీయ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో దూసుకుపోయారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి పెడిరెడ్డి తిమ్మ‌రెడ్డి కుమార్తెను ఆయ‌న వివాహం చేసుకున్నారు. ఇక ఈ వంశంలో మూడో త‌రం వార‌సుడిగా బొజ్జ‌ల కుమారుడు సుధీర్‌రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు శ్రీకాళ‌హ‌స్తి హాస్ప‌ట‌ల్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న సుధీర్‌రెడ్డి... గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.


Tags:    

Similar News