టీడీపీకి వలసల భయం..!

Update: 2019-02-14 07:05 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు  కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ మరోమారు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే మరోవైపు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు అధినేత చంద్రబాబు తలమునకలయ్యారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే టీడీపీకి తాజాగా వలసల జ్వరం పట్టుకుంది.

ఇటీవల టీడీపీ నేతలు వైసీపీలోకి జారుతుండడంతో పార్టీ అధిష్టానంలో ఆందోళన మొదలైంది. అసంతృప్త నేతలను ఓ వైపు బుజ్జగిస్తుండగానే మరోవైపు కొన్ని గెలుపు గుర్రాలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట కడప జిల్లా రాజపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆ తరువాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ జగన్‌ ను కలిశారు. అయితే తాను పార్టీని వీడడం లేదని చెప్పినా ఈనెల 13న చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయమని అర్థమైంది.

మరోవైపు ఆమంచి కృష్ణమోహన్‌ గ్రూపులోని సభ్యుడు, ఆయనకు మిత్రుడైన తోట త్రిమూర్తులుపై చర్చ మొదలైంది. ఆమంచి వైసీపీలో చేరడంతో  తోట త్రిమూర్తులు కూడా పార్టీని వీడుతారా..? అని అనుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శక్తివంతమైన నేతల్లో తోట త్రిమూర్తులు ఒకరు. కాకినాడ రూరల్‌- అమలాపురం- పిఠాపురం రామచంద్రాపురం నియోజకవర్గాలో ఆయన పరోక్షంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. ఇలాంటి సందర్భంలో వైసీపీ ఆయనపై గాలం వేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అలాగే మంత్రి గంటా శ్రీనివాస్‌ పై కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆయన కూడా టీడీపీ నుంచి బయటకు వస్తారని కొందరు ప్రచారం చేశారు. కానీ ఆయన ఆనుచర వర్గం మాత్రం తామెప్పటికీ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పడంతో పార్టీలో కలవరం ముగిసింది. ఇదంతా  గమనించిన బాబు ఇక పార్టీని వీడేవారు ఎవరు..? అసంతృప్త నేతలు ఎవరు..? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. వారికి అవసరమైన సపర్యలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా సరే గెలుపు గుర్రాలను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట..

Tags:    

Similar News