టీడీపీ కంచుకోటకు కాపు సెగ

Update: 2019-05-11 08:03 GMT
టీడీపీ కంచుకోట పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు.. అక్కడ రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ అభ్యర్థి ధీమాగా ఉన్నారు. కానీ ఈసారి ప్రత్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఫ్యాన్, గ్లాస్ పోటీతో టీడీపీ సైకిల్ కు టఫ్ పోటీ నెలకొంది.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ఈసారి గట్టి పోటీనెలకొంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ప్రభావశీలంగా ఉన్నారు. ఆయన గెలుపు ఓటములను నిర్ధేశించే స్థాయిలో ఉండడంతో టీడీపీ, వైసీపీల్లో గుబులు పట్టుకుంది.

2019 ఎన్నికల్లో నిడదవోలులో 87.13శాతం అత్యధికంగా పోలింగ్ జరిగింది. ఇక్కడ  కాపు సామాజికవర్గ ఓట్లు 57వేల ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత బీసీలు 70వేలు, ఎస్సీలు  25వేలు, మైనార్టీల ఓట్లు 15వేల ఓట్లు, కమ్మ సామాజికవర్గం 19వేల  ఉన్నాయి.

*టీడీపీ బూరుగుపల్లికి టఫ్ ఫైట్..
టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలిచారు. టీడీపీ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెంచుకున్నారు. అవే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఇసుక మాఫియా, రెండు సార్లు గెలవడంతో ప్రజావ్యతిరేకత ఆయనపై తీవ్రంగా ఉంది. టీడీపీలో ఆయనపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అయితే సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అంటున్నారు.

* వైసీపీ నుంచి శ్రీనివాసనాయుడుకి ప్లస్
వైసీపీ నుంచి పోటీచేస్తున్న శ్రీనివాసనాయుడు కాపు సామాజికవర్గం కావడం వైసీపీకి కొండంత బలంగా మారింది. గతంలో శేషారావు చేతిలో ఓడిపోవడంతో ఈయనపై సానుభూతి ఉంది. మాజీ ఎమ్మెల్యే అయిన తండ్రి వారసత్వం, కసిగా పనిచేసిన వైసీపీ శ్రేణులు, సామాజికవర్గం అండ పనిచేస్తుందని శ్రీనివాసనాయుడు భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ నాయుడు హైదరాబాద్ లో ఉంటారని స్థానికంగా ఉండరనే ఫిర్యాదు ఉంది.

*జనసేన నుంచి కుసుమాంజలి రమ్యశ్రీ
జనసేన నుంచి పోటీచేసిన కుసుమాంజలి రమ్యశ్రీ కూడా కాపు సామాజికవర్గం కావడంతో వైసీపీ, జనసేన మధ్య ఓట్ల చీలిక అనివార్యంగా మారింది. జనసేన ప్రభావం బాగా పనిచేసిందని ఆమె నమ్ముతున్నారు.

మొత్తానికి నిడదవోలు త్రిముఖ పోరులో బూరుగుపల్లికి ఈసారి టఫ్ ఫైట్ ఎదురైందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బూరుగుపల్లి హ్యాట్రిక్ కొడుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

    
    
    

Tags:    

Similar News