టీయారెస్ కమ్యూనిస్టులు కలిస్తే విన్.. టీడీపీ జనసేన కలిస్తే విన్ కాదా...?

Update: 2022-11-07 11:30 GMT
కలసి ఉంటే కలదు సుఖం. కలసి వచ్చిన అదృష్టం అని మునుగోడు ఉప ఎన్నిక గట్టిగా తెలియచేసింది. మునుగోడులో నిజానికి టీయారెస్ ఒంటరిగా పోటీ చేస్తే అక్కడ ఉన్న  లెక్క ప్రకారం ఓటమి తప్పదనే అంటారు. కానీ తెలివిగా టీయారెస్ పావులు కదిపింది. మునుగోడు అసెంబ్లీ సీటుని అయిదు సార్లు గెలుచుకుని గట్టి పట్టు కలిగిన కమ్యూనిస్టులను తన వైపునకు తిప్పుకుంది. అక్కడే గులాబీ బాస్ కేసీయార్ సరైన ఎత్తుగడ వేశారు అని అంటున్నారు.

వామపక్షాలకు ఈ నియోజకవర్గంలో పది నుంచి ఇరవై వేల దాకా ఓట్లు బ్యాంక్ ఉంది. అది చెక్కుచెదరనిది. అందికే హోరా హోరీ పోరులో ఆ ఓట్లే టీయారెస్ ని గట్టెక్కించాయి. ఏకంగా పదివేల పై చిలుకు మెజారిటీని కూడా దక్కించి ఘన విజయం అందుకునేలా చేశాయి. పొత్తు ఉంటే ఎపుడూ లాభమే అన్న రాజకీయ గణితాన్ని మరో సారి ఇలా రుజువు చేసిన ఎన్నిక మునుగోడు. మరి మునుగోడులో వర్కౌట్ అయిన పొత్తుల ఫార్ములా ఏపీలో ఎందుకు వర్కౌట్ కాదు అన్నది ప్రధాన ప్రశ్న.

ఏపీ రాజకీయాలను చూస్తే సింహం సింగిల్ గా వస్తుంది. మేము ఎవరు పొత్తులు పెట్టుకుని వచ్చినా ఎందరు కలసి పోటీ చేసిన గెలుస్తామని వైసీపీ నేతలు తరచూ బీరాలు పోతారు. కానీ ఒకటికి ఒకటి కలిస్తే రెండు అవుతుంది కదా. ఏది ఎలా చూసుకున్నా అది అదనపు బలమే కదా. మరి ఈ సింపుల్ లాజిక్ ని వైసీపీ ఎలా మిస్ అవుతోంది అన్నదే  చర్చగా ఉంది.

నిజానికి చూస్తే మునుగోడులో టీయారెస్ అధికార పార్టీ. రెండు సార్లు గెలిచిన పార్టీ యాంటీ ఇంకెంబెన్సీ ఆ పార్టీకి బాగా ఉంటుంది. అలాంటి వ్యతిరేకతను కూడా కప్పి పుచ్చేలా గెలుపు తీరాలకు చేర్చిన ఘనత పొత్తులది. వామపక్షాలు పొత్తులు కనుక లేకపోతే యాంటీ ఇంకెంబెన్సీ గట్టిగా పనిచేసేది అని కూడా చెబుతారు. మరి అలాంటి చోటనే పొత్తులు లాభాలుగా మారినపుడు ఏపీలో విపక్షాల మధ్య పొత్తులు ఎందుకు గరిష్ట లాభాలను తేలేవు అన్నది లాజిక్ తో కూడుకున్న ప్రశ్న.

ఇక్కడ ఎటూ అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకత దండీగా ఉంటుంది. దాన్ని చీల్చకుండా అన్ని పార్టీలూ కలసికట్టుగా పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీకి ఇబ్బందే అన్నది అసలైన విశ్లేషణ. పైగా ఒక వేవ్ కూడా క్రియేట్ అవుతుంది. జనాలు ఎపుడూ ఆల్టర్నేషన్ సరైనదా కాదా అన్నది చూస్తారు. వారికి అవతల పక్షం మీద నమ్మకం కలగాలి. అలాగే గెలిచే గుర్రంగా కూటమి ఉంటే కనుక కచ్చితంగా వారు ఆ వైపునకు మొగ్గు చూపుతారు.

పైగా ఏపీ రాజకీయాల్లో కులం ఫ్యాక్టర్ కూడా కీలకమైన భూమిక పోషిస్తుంది. ఇలా అన్ని అంశాలు కనుక పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అవుతుందనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తరువాత ఆ భావన మరింతగా పెరిగింది అని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్న్న నలభైయ్యేళ్ళ చరిత్ర కలిగిన టీడీపీ చరిష్మాటిక్ పవన్ నాయకత్వాన జనసేన కలిస్తే ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి మునుగోడు ఉప ఎన్నిక పొత్తులు వైసీపీలో అంతర్మధనం జరిగేలా చేస్తాయనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News