మంత్రి మేకప్‌ వేసుకుని తిరుగుతోందా? టీడీపీ నేత చింతమనేని వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2023-04-24 15:31 GMT
టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు.. నాటి దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. ముఖ్యంగా ఇసుక తవ్వకాలకు అడ్డుపడుతున్నారని ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి వ్యవహారంలో చింతమనేని హాట్‌ టాపిక్‌ గా మారారు. ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. నాటి ప్రతిపక్షం వైసీపీ వనజాక్షిపై దాడి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్‌ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తాజాగా చింతమనేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చింతమనేని తీసుకెళ్లారు. అయితే అక్కడ సరైన వసతులు, ఆక్సిజన్‌ సదుపాయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఆయన స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌æకు ఫోన్‌ చేశారు. ''సూపరింటెండెంట్‌ గారు నేను అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. నేను ప్రజల తరఫున మాత్రమే అడుగుతున్నా.. ఈ విషయాల్లో నేనేమీ రాజకీయాలు చేయట్లేదు. మీకు కానీ.. మీ ఉద్యోగులకు కానీ జీతాలు ఏమైనా ఆపుతున్నారా..?. ఆస్పత్రికి సంబంధించి ఏ సమస్యలు వచ్చినా జరగవు కానీ.. మీకు మాత్రం అన్నీ జరిగిపోతున్నాయ్‌ కదా'' అని నిలదీశారు.

జీతాలు తీసుకుంటున్నప్పుడు ఆస్పత్రిలో మంచి సదుపాయాలు ఎందుకు కల్పించరు..? అని చింతమనేని ప్రశ్నించారు. ఈ ఆస్పత్రి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి..? అని ప్రశ్నించారు. అసలు ఈ వార్డులు చూడండి ఎలా ఉన్నాయో.. ఒకసారి మీరు వచ్చి గంట కూర్చోని వెళ్లండి అని సూపరింటెండెంట్‌ ను చింతమనేని కోరారు.

ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిపై చింతమనేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రుల్లో ఇంత జరుగుతున్నా విడుదల రజిని ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. మంత్రి మేకప్‌ వేసుకుని తిరుగుతోందా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని చింతమనేని గుర్తు చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో విప్‌ గా పనిచేసిన చింతమనేని ప్రస్తుతం దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వంపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చింతమనేనిపై అనేక కేసులు నమోదు చేసి జైలుపాలు చేసిన సంగతి తెలిసిందే. ఒక కేసుపై బెయిల్‌ మీద బయటకొస్తున్నా ఇంతలోనే మరొక కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం ఆయనకు కల్పించిందనే విమర్శలు ఉన్నాయి.

Similar News