ఒక్కొక్క‌రూ రెండేసి.. బాబుకు ముప్పుతిప్ప‌లు..!

Update: 2022-12-12 07:35 GMT
''ఒక్కొక్క కుటుంబం రెండేసి టికెట్లు అడుగుతోంది. ఏం చేయాలి?''.. ఇదీ టీడీపీ అదినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న ఒక నాయ‌కుడు మీడియా ముందు  వెలిబుచ్చిన ఆవేద‌న‌. ఇది నిజ‌మే. అనేక జిల్లాల్లో ఒక్కొక్క కుటుంబం రెండేసి అసెంబ్లీ అడుగుతుండ‌డంతో పార్టీ అధినేత త‌ల‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. అలా కాదు, ఈసారి జ‌రిగే ఎన్నిక‌లుఅత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. సో.. ఈ సారికి వ‌దిలేయండి.. అని చంద్ర‌బాబు బుజ్జ‌గిస్తున్నారు. అయినా, ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేస్తోంది. ఎప్పుడు ఏక్ష‌ణ‌మైనా సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబుకు ఉప్పందింది. దీంతో ఆయ‌నే స్వ‌యంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌ద్ద‌కు వ‌స్తున్న పంచాయ‌తీల‌ను చూస్తున్న సీనియ‌ర్ నాయ‌కుడు, ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ, మా వాళ్ల‌కు ఆశ‌లు చాలానే ఉన్నాయి. కానీ, గెలుస్తారా? అంటే చెప్ప‌లేరు. హామీ ఇస్తారా? అంటే ఇవ్వ‌లేరు. కానీ, రెండేసి టికెట్లు మాత్రం కావాలంట‌. ఇది సాధ్య‌మ‌య్యేది కాదంటే వినిపించుకోవ‌డం లేద‌న్నారు.

క‌ర్నూలు విష‌యాన్ని తీసుకుంటే.. కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబం రెండు టికెట్లు కావాల‌ని పోరు చేస్తోంది. ప‌త్తికొండ‌, డోన్ రెండూ కూడా త‌మ‌కంటే త‌మ‌కే కావాల‌ని, కేఈ ప్ర‌భాక‌ర్ ప‌ట్టుబ‌డుతున్నారు. దీనిపై తాడో పేడో తేల్చుకుంటామ‌ని కూడా శ‌ప‌థాలు చేస్తున్నారు. ఇవ్వ‌క‌పోతే ఎలా ఇప్పించుకోవాలో కూడా తెలుసున‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీనిపై చంద్ర‌బాబు ఆగ్ర‌హంతోనేఉన్న‌ప్ప‌టికీ.. రెబ‌ల్‌గా మారితే మ‌రింత ప్ర‌మాద‌మ‌నే భావ‌న ఉన్నారు.

ఇక‌, ఇదే జిల్లాకుచెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా.. ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని, నంద్యాల‌ను త‌న త‌మ్ముడు జ‌గ‌త్‌కు, ఆళ్ల‌గ‌డ్డ‌ను త‌న‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు స‌మాచారం.

అయిలే, అస‌లు ఆమె పేరును కూడా ప‌రిగ‌ణించ‌ని స‌మ‌యంలో ఇప్పుడు ఆమె రెండు టికెట్లు డిమాండ్ చేయ‌డం.. సెల్పీ వీడియోలు తీసుకుని పార్టీ కార్య‌కర్త‌ల‌కు ఫార్వ‌ర్డ్ చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ రెండు మావేన‌ని ప్ర‌చారం చేయ‌డం.. ఇప్పుడు స్థానికంగా గంద‌ర‌గోళానికిదారితీస్తోంది.

ఇక‌, అనంత‌పురం జిల్లాలో ధ‌ర్మ‌వ‌రం, రాప్తాడు విష‌యం కూడా ఇలానే ఉంది. రాప్తాడు మా అమ్మ‌, ధ‌ర్మ‌వ‌రం నేను.. అంటూ ప‌రిటాల శ్రీరాం మీడియా ముందుచేస్తున్న కామెంట్లు టీడీపీలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే రాప్తాడుపై చంద్ర‌బాబు క్లారిటీ ఇవ్వ‌డం, ధ‌ర్మ‌వ‌రాన్ని హోల్డ్ పెట్ట‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. రెండు మావేన‌ని శ్రీరాం చెబుతుండ‌డం చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ వివాదాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతో చంద్ర‌బాబుకు ఈ త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉంద‌ని సీనియ‌ర్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News