టీడీపీ కోసం ప‌నిచేస్తే...రౌడీ షీట్లు ఎత్తేస్తారట‌!

Update: 2017-07-06 10:53 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో అధికార టీడీపీ అడ్డంగా బుక్క‌యిపోయింది. పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే గెలుపు అని చెప్పేందుకు ఆ పార్టీ నానా పాట్లు ప‌డుతోంది. కేవ‌లం ఓ అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను స్వ‌యంగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు టేక‌ప్ చేశార‌న్న విష‌యం చూస్తేనే... ఆ పార్టీ ఈ ఎన్నిక‌ను ఏ స్థాయిలో భావిస్తుందో ఇట్టే అర్ధం కాక‌మాన‌దు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థి గెలిచిన స్థానాన్ని తిరిగి ద‌క్కించుకునేందుకు విప‌క్ష వైసీపీ కూడా ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇంకా నోటిఫికేష‌న్ విడుద‌ల కాకున్నా... ఇరు పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించేశాయి. ఇరు పార్టీల అభ్య‌ర్థులు కూడా బ‌రిలోకి దిగిపోయారు.

ఇక టీడీపీ ఈ ఎన్నిక‌కు సంబంధించి టీడీపీ అడ్డంగా బుక్కైన విష‌యంలోకి వ‌స్తే... నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకునే నిన్న నంద్యాల‌కు వెళ్లిన టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు... అక్క‌డి నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ సీనియర్ నేత‌లు, మాజీ మంత్రులు ఎన్ ఎండీ ఫ‌రూఖ్‌ - కేఈ ప్ర‌భాక‌ర్ లు కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మైకందుకున్న సోమిశెట్టి... కార్య‌కక‌ర్త‌లు, పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెను క‌ల‌క‌ల‌మే రేపాయి.

మైకందుకున్న సోమిశెట్టి నోటి వెంట‌...*రౌడీ షీట్ల‌కు ఏమాత్రం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాను. పార్టీ గెలుపు కోసం ప‌నిచేస్తే... రౌడీ షీట్ల‌ను ఎత్తివేస్తాం. త్వ‌ర‌లోనే నంద్యాల‌కు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - మంత్రి నారా లోకేశ్ వ‌స్తున్నారు. ఆ స‌మ‌యంలో లోకేశ్ స‌మావేశ‌మ‌య్యేలా చూస్తాం* అ వ్యాఖ్య‌లు వినిపించాయి. అంటే స‌ద‌రు స‌మావేశానికి రౌడీ షీట‌ర్లు వ‌చ్చార‌ని ఇట్టే అర్థ‌మైపోయింది. కాస్తంత గుట్టుగా నిర్వ‌హిద్దామ‌నుకున్న స‌మావేశం స‌మాచారం అందుకున్న మీడియా సోమిశెట్టి, ఇత‌ర టీడీపీ నేత‌ల‌కు తెలియ‌కుండానే మొత్తం కార్య‌క్ర‌మాన్ని షూట్ చేసేసింది. కాసేప‌టి క్రితం ఈ వీడియోలు ప‌లు తెలుగు న్యూస్ ఛానెళ్ల‌లో ప్ర‌సారం అవ‌డంతో టీడీపీ నేత‌ల‌కు భారీ షాక్ త‌గిలిన‌ట్లైంది. సోమిశెట్టి ప్ర‌సంగాన్ని పూర్తిగా ప‌రిశీలిస్తే... స‌ద‌రు స‌మావేశానికి రౌడీ షీట‌ర్లు హాజ‌ర‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే మొన్న సీఎం చంద్రబాబు ముస్లిం సోద‌రుల‌కు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఓ రౌడీ షీట‌ర్ హాజ‌రు కావ‌డ‌మే కాకుండా... చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా మెలిగార‌న్న వార్త కూడా వినిపించింది. తాజాగా రౌడీ షీట‌ర్లను స‌మావేశానికి ఆహ్వానించిన టీడీపీ నేత‌లు... నంద్యాల‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి గెలుపు కోసం కృషి చేయాల‌ని వారిని అభ్య‌ర్థించ‌డం నిజంగానే సంచల‌నంగా మారింది. ఇప్పుడు దీనిపై టీడీపీ ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రౌడీ షీట‌ర్ల‌కు భ‌రోసా ఇచ్చేలా సోమిశెట్టి మాట్లాడుతున్నా... వేదిక‌పైనే ఉన్న మాజీ మంత్రులు కేఈ ప్ర‌భాక‌ర్ గానీ, ఎన్ఎండీ ఫ‌రూఖ్ గానీ ఆయ‌న‌ను వారించకుండా సైలెంట్ గా కూర్చుని ఉండిపోవ‌డం పైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News