టీడీపీలో లొల్లిపుట్టిస్తున్న ఆ ఒక్క ప‌ద‌వి..!

Update: 2019-07-23 08:53 GMT
ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యంతో ద‌య‌నీయ స్థితికి చేరిపోయిన టీడీపీలో ఇప్పుడు స‌రికొత్త లొల్లి మొద‌లైంది. ప్ర‌తిపక్షానికి ఇచ్చే పీఏసీ ప‌ద‌వి కోసం ఉన్న‌ కొద్దిపాటి ఎమ్మెల్యేలు లొల్లి పెట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్ల‌లో ఎలాంటి ప‌దవులూ ఉండ‌వు. ఉన్న ఒక్క‌గానొక్క ప‌ద‌వి పీఏసీ. ఇది కేబినెట్ హోదా గ‌ల‌ది. దీంతో ఈ ప‌ద‌వి కోసం టీడీపీలో ఉన్న 23మంది ఎమ్మెల్యేల్లో స‌గానికిపైగా మంది ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అసెంబ్లీలో బ‌లంగా వాద‌న వినిపించే వాళ్లే క‌రువ‌య్యారు. ఒక‌రో ఇద్ద‌రో ఏదో కొంత మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌ - మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది.

పీఏసీ ప‌ద‌వి కోసం ప్ర‌ధానంగా సీనియ‌ర్ ఎమ్మెల్యేలు గొరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి - అచ్చెన్నాయుడు - గంటా శ్రీ‌నివాస‌రావులు తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు. అయితే..వీరిలో ఎక్కువ‌గా టీడీపీ త‌రుపున వాద‌న వినిపిస్తున్న‌ది.. అధికార వైసీపీకి కౌంట‌ర్ ఇస్తున్న‌ది బుచ్చ‌య్య చౌద‌రి - అచ్చెన్నాయుడు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఎక్కువ‌గా వీరిద్ద‌రే మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పీఏసీ ప‌ద‌విపై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్ట‌కుంటున్నారు. ఎలాగైనా త‌నకే ప‌ద‌వి వ‌స్తుంద‌ని బుచ్చయ్య‌ చౌద‌రి - లేదు.. లేదు.. త‌న‌కే చంద్ర‌బాబు ఇస్తార‌ని అచ్చెన్నాయుడు.. ఇలా ఎవ‌రిలెక్క‌లు వారు వేసుకుంటున్నారు.

అయితే, ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అచ్చెన్నాయుడు కంటే సీనియ‌ర్. గ‌త ప్ర‌భుత్వంలో కూడా మంత్రి ప‌ద‌వి కోసం బాగానే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ.. ఆ ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో ఈసారి పీఏసీ ప‌ద‌వి త‌న‌కే ఇస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక‌, విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కూడా ఈ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. చాలా కాలంగా ఆయ‌న అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా ఏమీ మాట్లాడ‌డం లేదు. అంటే.. అసంతృప్తితో ఉన్న గంటాకు ఈ ప‌ద‌వి ఇస్తారా ? అన్న చ‌ర్చ‌లు కూడా పార్టీలో న‌డుస్తున్నాయి.

గంటాకు ఈ ప‌ద‌వి ఇస్తే కాపు సామాజిక‌వ‌ర్గాన్ని కూడా ఆక‌ట్టుకున్న‌ట్లు ఉంటుంద‌ని ప‌లువురు అంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం గ‌త ఐదేళ్ల‌లో కాపుల‌కు చాలా చేసినా వాళ్లు ఓట్లేయ‌లేద‌ని... ఇప్పుడు మాత్రం ఆ వ‌ర్గంకు ఈ ప‌ద‌వి ఇస్తే ఉప‌యోగం ఏం ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఇందులో ఎవ‌రికి ప‌ద‌వి ఇచ్చినా.. మ‌రొక‌రు అల‌క‌బూనే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌వేళ పార్టీని వీడినా ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News